తెల్లరేషన్‌కార్డులుంటే 420,468,471,120బీ, 403,341 కేసులా..?: బుద్దా వెంకన్న

By Arun Kumar PFirst Published Feb 8, 2020, 9:53 PM IST
Highlights

సీబీఐ, ఈడీ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న సీఎం జగన్‌ తనపై ప్రజలదృష్టి ఉండకూడదన్న ఆలోచనతో, వారిపై కూడా కేసులు మోపేలా అధికారులు , పోలీస్‌ యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నాడన్నారు. 

అమరావతి: తనమీద కేసులున్నప్పుడు ప్రజలపై, ప్రతిపక్షనాయకులపై ఎందుకు ఉండకూడదన్న దురుద్దేశంతో ఉన్న జగన్మోహన్‌రెడ్డి  ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై తప్పుడు కేసులు మోపుతూ వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడని టీడీపీనేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. 

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్‌ తనపై ప్రజలదృష్టి ఉండకూడదన్న ఆలోచనతో, వారిపై కూడా కేసులు మోపేలా అధికారులు , పోలీస్‌ యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నాడన్నారు. రాష్ట్రంలో పేదలకు తీరని అన్యాయం చేస్తున్న సీఎం వారి జీవనవిధానాన్ని మరింత దిగజార్చేలా ప్రవర్తిస్తున్నాడన్నారు.  

ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడు జీవించాలంటే నెలకు రూ.20వేలవరకు అవుతోందని, ఆదాయం పేరుతో పేద, మధ్య తరగతి వారికి ఇస్తున్న సంక్షేమ పథకాలను నిలిపివేయడం మంచిపద్ధతి కాదని వెంకన్న హితవు పలికారు. నెలకు రూ.20వేలు, అంత కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి కార్డులు, పెన్షన్లు ఇవ్వాల్సిందేనన్నారు. 

150మంది సభ్యులను గెలిపించింది ప్రజల సంక్షేమ పథకాలు తీసేయడానికి కాదన్న విషయాన్ని జగన్‌ తెలుసుకోవాలన్నారు.  పేదల ఆదాయం, అర్హతలను నిర్ణయించడానికి జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలు పాటిస్తోందో చెప్పాలని వెంకన్న డిమాండ్‌ చేశారు.  నెలకు రూ.20వేల వరకు ఆదాయం వచ్చేవారికి తెల్లకార్డులు ఇవ్వాల్సిందేనని బుద్ధా తేల్చిచెప్పారు. 

read more  మూడు రాజధానులపై ప్రశ్నిస్తే యువతిని గెస్ట్ హౌస్ కు రమ్మంటారా...: టిడిపి అనిత పైర్

ప్రభుత్వం అమలుచేస్తున్న మద్యపాన నిషేధం ముసుగులో జరుగుతున్న దోపిడీని తప్పుబట్టారు.  రాష్ట్ర ఎక్సైజ్‌మంత్రి ఎక్కడకు రమ్మంటే అక్కడకు చర్చకు వస్తానని, మంత్రికూడా రావాలని వెంకన్న సూచించారు. ఉచితంగా వచ్చే మద్యం కేసులు అమ్మగా వచ్చిన ఆదాయం, క్వార్టర్‌బాటిల్‌పై రూ.30నుంచి రూ.40వరకు అదనంగా వసూలుచేస్తున్న జేట్యాక్స్‌ ఎవరి జేబుల్లోకి వెళుతుందో సమాధానం చెప్పకుండా మంత్రి తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. 

శాసనమండలి పదవి ఉన్నా లేకున్నా, లెక్కచేసే మనిషిని కాదని, ఆ పదవి చంద్రబాబు పెట్టిన భిక్షని వెంకన్న తేల్చిచెప్పారు. మండలిలో వైసీపీకి 9మంది సభ్యులున్నారని, వారిలో ఒక్కరు రాజీనామా చేసినా వెంటనే తాను కూడా రాజీనామా చేస్తానని వెంకన్న స్పష్టం చేశారు. 

రేషన్‌కార్డులున్నవారిపై ఫోర్జరీ సంతకాలు చేసేవారిపై పెట్టే సెక్షన్‌-468, దొంగపత్రాలు సృష్టించేవారిపై పెట్టే471,120బీ, బినామీ ఆస్తులున్నవారిపై పెట్టే 403సెక్షన్‌, వ్యక్తులను అడ్డగించినవారిపై పెట్టే సెక్షన్‌-341లు పెట్టడం ఎంత దుర్మార్గమో ఆలోచించాలన్నారు. పెనమలూరుకు చెందిన ఒకవ్యక్తిపై  420కేసు సహా  పైన చెప్పిన సెక్షన్లన్నీ మోపారని,  తెల్లకార్డు ఉండటమే అతని నేరమన్నారు. ఆ వ్యక్తికి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హాయాంలో కార్డు వచ్చిందని, అతను నిజంగా అనర్హుడైతే కార్డు ఇచ్చినవారిని వదిలేసి, తీసుకున్న వారిని తప్పుపట్టడం ఏంటని బుద్ధా నిలదీశారు. 

read more  అమరావతి భూములపై సీఐడి విచారణ వేగవంతం...ఆ 106మందిపై...

తండ్రి కార్డులిస్తే కొడుకు వాటిని తీసేస్తూ అవి తీసుకున్న వారిని తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తానని చెప్పిన జగన్‌, అధికారంలోకి రాగానే రూ.5వేలు ఆదాయం ఉన్నవారిక్కూడా కార్డులు తీసేస్తున్నాడన్నారు. 

లోకేశ్‌కు, చంద్రబాబుకి భద్రత తగ్గించి శునకానందం పొందుతున్నంత మాత్రాన వారిభద్రతకు వచ్చిన ఢోకాఏమీ ఉండదని... ప్రజలు, పార్టీనేతలే అన్నివేళలా అండగా ఉండి వారిని కాపాడుకుంటారని విలేకరులు అడిగినప్రశ్నకు సమాధానంగా  బుద్ధా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు తీసేసిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పటికే అసమర్థత, చేతగానితనంతో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లాడని బుద్దా మండిపడ్డారు. 
 

click me!