Galam Venkata Rao | Published: Apr 23, 2025, 5:00 PM IST
జమ్మూకశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 28 మంది పర్యాటకులను హతమార్చిన దుశ్చర్యను నిరసిస్తూ మృతులకి నివాళిగా జనసేన పతాకాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అవనతం చేశారు. బుధవారం ఉదయం పతాకాన్ని సగం వరకూ దించారు. ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ... అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. పహల్గాం దాడి ఘటన దేశానికి ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ దాడి సమాచారం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా కలత చెందారని... ఎక్స్ వేదికగా తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారని తెలిపారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారని వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జనసేన పార్టీ కార్యాలయాలు, జనసేన నాయకుల ఇళ్లపై ఉన్న పార్టీ జెండాను అవనతం చేస్తున్నామన్నారు. సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పిస్తామన్నారు. శుక్రవారం మావనహారాలు జరుగుతాయని... రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా మానవహారంలో పాల్గొంటారని తెలిపారు హరిప్రసాద్. జనసైనికులు, వీరమహిళలే కాకుండా దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ పాల్గొని అమరులైన వారికి సంఘీభావం తెలియజేయాలని కోరారు.