Galam Venkata Rao | Published: Apr 24, 2025, 4:00 PM IST
‘పహల్గాం ఉగ్రదాడి దుర్మార్గమైన చర్య. అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు తూటాల వర్షం కురిపించడం దేశంలోని ప్రతి పౌరుడిని కదిలించింది. ఈ దుశ్చర్యలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పార్టీ తరఫున మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తున్నామ”ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేతన్న కూడలి వద్దనున్న భారీ జాతీయ పతాకం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రదర్శనలో నాదెండ్ల మనోహర్ తోపాటు శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, నెల్లిమర్ల శాసన సభ్యురాలు లోకం నాగ మాధవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “మతం పేరిట ఇంతటి మారణహోమం సృష్టించడం హేయమైన చర్యగా జనసేన పార్టీ భావిస్తోందన్నారు.