Aug 10, 2022, 12:44 PM IST
మంగళగిరి : మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సొంత నియోజకవర్గంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన కీలక నాయకుడు, టిడిపి అధికార ప్రతినిధి గంజి చిరంజీవి టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మంగళగిరి ప్రెస్ క్లబ్ భవన్ లో తన రాజీనామాను ప్రకటిస్తూ మీడియా ఎదుటే చిరంజీవి కన్నీటి పర్యంతం అయ్యారు. సీటు ఇచ్చి సొంత పార్టీ నేతలే ఓడించారని ఆవేదన వ్యక్తం చేసారు. సొంత పార్టీలోనే కొందరు నేతలు తనను మానసికంగా హత్య చేసారని... బిసి నేతను కావడంవల్లే తనను రాజకీయంగా ఎదగనివ్వలేదని పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న అవమాన భారం భరించలేకనే పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని చిరంజీవి పేర్కొన్నారు.