శ్రీవారి భక్తులకు శుభవార్త: 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాల గుండా దర్శనం

By Siva KodatiFirst Published Nov 27, 2019, 11:15 AM IST
Highlights

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు తెరిచి వుంచాలని టీటీడీ భావిస్తోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు తెరిచి వుంచాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం లభిస్తోంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో వైకుంఠ ద్వారాలను తెరవాలని టీటీడీ భావిస్తోంది. పది రోజుల పాటు వైకుంఠ ద్వారాల గుండా భక్తులను అనుమతించేందుకు ఆగమ సలహా మండలి సైతం అనుమతనిచ్చింది. దీనికి పాలక మండలి ఆమోదం లభిస్తే ఈ ఏడాది నుంచే ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.

ఈ విధానం ఇప్పటికే తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో అమల్లో ఉంది. ఆగమ సలహా మండలిలో సభ్యులైన వేణుగోపాల దీక్షితులు, రమణ దీక్షితులు, అనంత శయన దీక్షితులు, సుందర వదన భట్టాచార్యులు, మోహన రంగాచార్యులు ఈ ఐదుగురు ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా సమ్మతిని తెలియజేశారు.

అన్ని అనుకూలిస్తే వైకుంఠ ఏకాదశి నుంచి మకర సంక్రాంతి వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచుతారు. డిసెంబర్ మొదటి వారంలో జరిగే పాలకమండలి సమావేశంలో ఈ తీర్మానాన్ని సభ్యుల ముందు ఉంచనున్నారు. 

click me!