కొబ్బరికాయలతో వింత నిరసన... ప్రభుత్వానికి టిడిపి ఎమ్మెల్సీ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Oct 10, 2019, 4:37 PM IST
Highlights

తిరుమల శ్రీవారి సన్నిధిలోనే టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ నిరసన చేపట్టారు. ప్రజా సమస్యలపై ఆ దేవుడికే వినతిపత్రం సమర్పించారు. 

ఉపాధిహామీ బకాయి నిధులు వెంటనే చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతి పట్టణంలోఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో  సర్పంచు, ఎంపిటిసి, ఎంపిపి, జడ్పీటిసిల నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు.
చెల్లించకుండా వదిలేసిన ఉపాధిహామీ నిధులు  2500 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాంటి మంచి బుద్ధిని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాదించాలని తిరుమల వేంకటేశ్వరస్వామిని కోరారు. ఇందుకోసం అలిపిరి మెట్లమార్గం వద్ద 101 కొబ్బరికాయలను కొట్టి రాజేంద్రప్రసాద్  వినూత్నంగా నిరసన తెలిపారు. 

 

అంతేకాకుండా అలిపిరి పాదాల మండపం వద్ద విజ్ఞాపన పత్రాన్ని వైకుంఠవాసుడు వేంకటేశ్వర స్వామికి సమర్పించారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్రప్రభుత్వానికి రాజేంద్రప్రసాద్ హెచ్చరిక చేశారు.

ఈ కార్యక్రమంలో  పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరంకి గురుమూర్తి, సెక్రటరీ శింగంశెట్టి సుబ్బరామయ్య, ఏపి సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి,  చిత్తూరు జిల్లా ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు చింతా కిరణ్ యాదవ్,  చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చుక్కా ధనుంజయ్ యాదవ్, ఇంకా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు సోమల సురేష్, అరుణ, గౌస్ పాషా, గుర్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

click me!