లాక్ డౌన్ కు ఎమ్మెల్యే మధుసూదన్ టోకరా: 5 కార్లలో 39 మందితో హల్ చల్

By telugu team  |  First Published Apr 15, 2020, 2:29 PM IST
ఏపీ కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించే ప్రయత్నం చేశారు. చిత్తూరు జిల్లాలోని ఏపీ, కర్ణాటక సరిహద్దులో ఐదు కార్లతో, 39 మందితో హలచ్ చల్ సృష్టించారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో హచ్ చల్ చేశారు. ఐదు వాహనాల్లో 39 మందితో ఆయన చిత్తూరు జిల్లా సరిహద్దులోని చీకలబైలు చెక్ పోస్టు వద్దకు వచ్చారు. ఆయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. 

తనను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే మధుసూదన్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. లాక్ డౌన్ అమలులో ఉన్నందున లోనికి అనుమతించేది లేదని, లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆయనతో చెప్పారు. అయినా ఆయన వినలేదు.

చాలాసేపు ఆయన చెక్ పోస్టు వద్దే ఉన్నారు. ఓ సమయంలో ఆయన తిరుపతి వైపు వెళ్తూ మదనపల్లిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. మదనపల్లెలో ఎమ్మెల్యేను పోలీసులు విచారించారు. వారంతా బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. 

ఇదిలావుంటే, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అటు కర్ణాటకలోనూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాలని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఎమ్మెల్యే బేఖాతరు చేస్తూ గొడవకు దిగడాన్ని తప్పు పడుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. తాజాగా ఏపీలో 19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కు పెరిగింది. ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ -19 వల్ల 11 మంది మరణించారు. 
click me!