Taipei Open 2022: భారత్ కోట్లాది ఆశలు పెట్టుకున్న పారుపల్లి కశ్యప్ తైపీ ఓపెన్ లో పోరాటం చాలించాడు. క్వార్టర్స్ లోనే అతడు ఇంటిముఖం పట్టాడు.
తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్ - 2022 లో భారత పోరాటం ముగిసింది. దేశం ఆశలు పెట్టుకున్న పారుపల్లి కశ్యప్ తో పాటు మిక్స్డ్ డబుల్స్ లో ఇషా భట్నాగర్-తనీషా క్రస్టోల జోడీ క్వార్టర్స్ లోనే వెనుదిరిగింది. మహిళల డబుల్స్ లో సైతం తనీషా-శృతి ల జోడీ ఓడటంతో భారత్ కు తీవ్ర నిరాశ తప్పలేదు. తొలి రౌండ్ లో రాణించిన భారత షట్లర్లలో పలువురు రెండో రౌండ్ లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.
పురుషుల క్వార్టర్స్ లో భాగంగ పారుపల్లి కశ్యప్ 12–21, 21–12, 17–21తో మలేషియాకు చెందిన జువెన్ చేతిలో ఓడాడు. తొలి రౌండ్ లో ఓడినా రెండో రౌండ్ లో పుంజుకున్న కశ్యప్.. తిరిగి పుంజుకున్నట్టే కనిపించాడు. కానీ మూడో రౌండ్ లో మళ్లీ పుంజుకున్న జువెన్.. కశ్యప్ తో హోరాహోరి పోరాడి విజయం సాధించాడు.
undefined
ఇక మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్ లో తనీషా-ఇషాన్ భట్నాగర్ జోడీ 19-21, 12-21 తేడాతో మలేషియాకే చెందిన హూ పాంగ్ రోన్- తో ఈ వె చేతిలోనే ఓడింది. తొలి రౌండ్ లో హోరాహోరి పోరాడిన ఈ జంట.. రెండో రౌండ్ లో చేతులెత్తేసింది.
మహిళల డబుల్స్ క్వార్టర్స్ లో తనీషా-శృతి ద్వయం.. 16-21 22-20, 18-21 తేడాతో ఎన్జీ సాజ్ యా - సాంగ్ హి యాన్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడింది. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసినట్టైంది.
ఇదిలాఉండగా ఈ టోర్నీలో క్వార్టర్స్ లో నిష్క్రమించినందుకు గాను కశ్యప్ కు 3వేల డాలర్ల ప్రైజ్ మనీ (రూ. 2 లక్షల 39 వేలు) తో పాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు కూడా లభించాయి. తైపీ ఓపెన్ ముగిసిన నేపథ్యంలో ఇక భారత షట్లర్ల దృష్టంతా ఈనెల 28 నుంచి ప్రారంభం కాబోయే కామన్వెల్త్ గేమ్స్ మీద పడింది.
కామన్వెల్త్ లో ముఖ్యంగా లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, సాత్విక్ రాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ, అశ్విని పొన్నప్ప-సుమిత్ రెడ్డీల మీదే భారత్ ఆశలు పెట్టుకుంది. మరి వీరిలో పతకం తెచ్చేవారెవరో..?