మా నాన్న చనిపోతే రాజకీయాలు చేశామా... ఎంత బాధపడ్డామో నీకు తెలుసా : జగ్గారెడ్డికి షర్మిల కౌంటర్

By Siva KodatiFirst Published Sep 27, 2022, 6:15 PM IST
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటరిచ్చారు. తన తండ్రి చనిపోయినప్పుడు.. మేం రాజకీయాలు చేశామని జగ్గారెడ్డి అన్నారని, తాము ఎంత బాధపడ్డామో ఆయనకేం తెలుసు అని షర్మిల నిలదీశారు

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉదయం తనపై చేసిన వ్యాఖ్యలకు గాను జగ్గారెడ్డికి కౌంటరిచ్చారు షర్మిల. తనకు వార్నింగ్ ఇవ్వడానికి జగ్గారెడ్డి ఎవరు అని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి చనిపోయినప్పుడు.. మేం రాజకీయాలు చేశామని జగ్గారెడ్డి అన్నారని, తాము ఎంత బాధపడ్డామో ఆయనకేం తెలుసు అని షర్మిల నిలదీశారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలంతా తనపై ఫిర్యాదు చేసినా భయపడలేదన్నారు. తనను ఓ మంత్రి మంగళవారం మరదలు అన్నారని.. ఎవడ్రా నువ్వు అన్నందుకు తనపైనే కేసు పెట్టారని షర్మిల తెలిపారు. 

అంతకుముందు మంగళవారం నాడు హైద్రాబాద్ లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులు ఎందుకు మూడు రాష్ట్రాలు చేయాలని ఆయన ఏపీ సీఎం జగన్ కు సలహ ఇచ్చారు. అమరావతి, కడప, విశాఖలను రాజధానులుగా చేసుకుని పాలన చేయాలని జగ్గారెడ్డి సూచించారు. మూడు రాష్ట్రాలకు మీ కుటుంబంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కావచ్చన్నారు.  మీ ఇంట్లో వాళ్లే సీఎంలుగా ఉండాలా అని జగ్గారెడ్డి  షర్మిలను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల ఎందుకు పాదయాత్ర చేయడం లేదో చెప్పాలన్నారు.  

Also Read:జగన్ ను ఒప్పించి ఏపీలో షర్మిలను సీఎం చేయండి: విజయమ్మకు జగ్గారెడ్డిసలహా

తెలంగాణలో  కాంగ్రెస్, లెఫ్ట్ , బీజేపీ, ఎంఐఎం లున్నాయని.... ఇన్ని పార్టీలతో షర్మిల పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఏపీలో మాత్రం ఇంత పోటీ ఉండదని జగ్గారెడ్డి చెప్పారు. మీ కుటుంబంలో పంచాయితీని రాష్ట్రాల మధ్య పంచాయతీగా మార్చొద్దని కూడా విజయమ్మకు జగ్గారెడ్డి సలహ ఇచ్చారు. షర్మిల ఏం చేసినా తెలంగాణలో నాయకురాలు కాలేదన్నారు. 

షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు తనను కోవర్ట్ అన్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోవర్ట్ అని తనను విమర్శించడం తనకు ఓ శాపమని అనుకొంటున్నానన్నారు. కేటీఆర్ కు తాను కోవర్ట్ అని షర్మిల  చేసిన విమర్శలపై కూడా ఆయన స్పందించారు. కేటీఆర్ తనను అసెంబ్లీలో మాత్రమే కలుస్తాడని చెప్పారు. తాను ప్రయత్నిస్తే కేటీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.  కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల అపాయింట్ మెంట్ ల కోసం ప్రయత్నించినా కూడా వారి అపాయింట్ మెంట్లు లభ్యం కావన్నారు. కానీ తనపై కోవర్ట్ అంటూ విమర్శలు చేయడం ఏమిటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 
 

click me!