ములుగులో దేశంలోనే తొలి ఫారెస్ట్ యూనివర్సిటీ!.. ప్రపంచంలో మూడోది.. పర్యావరణం, అటవీ సంరక్షణపై సీఎం ఫోకస్

By Mahesh KFirst Published Sep 27, 2022, 5:05 PM IST
Highlights

హైదరాబాద్ సమీపంలోని ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీని మరింత అభివృద్ధి చేసి ఫారెస్ట్ యూనివర్సటీగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం శాసన సభ, శాసన మండలి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ఆమోదం తర్వాత పాలనా పరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది. మన దేశంలో ఇదే తొట్టతొలి అటవీ విశ్వవిద్యాలయం. ప్రపంచంలోనే ఫారెస్ట్ యూనివర్సటీలు కేవలం రష్యా, చైనాల్లో మాత్రమే ఉన్నాయి.
 

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పర్యావరణం, అటవీ సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంతర్జాతీయ పర్యావరణ మార్పులు, జీవ వైవిద్యానికి ప్రాధాన్యత పెరిగిన తరుణంలో అటవీ విద్యపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ కాలేజీని ఫారెస్ట్ యూనివర్సిటీగా మార్పులు చేస్తున్నది. అసెంబ్లీ ఆమోదం తర్వాత పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నది.

సీఎం కేసీఆర్ 2016లో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్ఐ)ను నెలకొల్పారు. ఇప్పుడు అదే కాలేజీని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. 2016లో దీన్ని దూలపల్లి పారెస్ట్ అకాడెమీలో ప్రారంభించారు. కానీ, సీఎం చొరవతో హైదరాబాద్ సమీపంలోని ములుగు వద్దకు క్యాంపస్‌ను మార్చారు. జాతీయ స్థాయి యూనివర్సిటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా సర్వ హంగులు, సకల సౌకర్యాలు, ఆధునిక వసతులుతో ఈ ఫారెస్ట్ కాలేజీ ఉన్నది. దీన్ని ఇప్పుడు విశ్వవిద్యాలయంగా మారుస్తున్నారు. ఈ యూనివర్సిటీ నుంచి జాతీయ స్థాయి పర్యావరణ నిపుణులు, అకిల భారత స్థఆయి అధికారులు రావాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు. అందుకు తగినట్టుగానే మొదటి బ్యాచ్ నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలతోపాటు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు డెహ్రాడూన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఐకార్ వంటి చోట్ల చదువుతున్నారు. ఓ విద్యార్థి ఐఎఫ్ఎస్ కూడా సాధించడం గమనార్హం.

అటవీ విశ్వవిద్యాలయానికి శాసన సభ, శాసన మండలి ఆమోదం తెలిపిందని, ఫారెస్ట్ కాలేజీ డీన్‌గా చేస్తున్న ముఖ్యమంత్రి ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశ ఫారెస్ట్ ఎడ్యుకేషన్‌లో ఇది చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు.

ఈ యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్ మన దేశంలో తొట్టతొలి ఫారెస్ట్ యూనివర్సిటీ. ఇలా ఫారెస్ట్ యూనివర్సిటీలు కేవలం రష్యా, చైనాల్లో మాత్రమే ఉన్నాయి. ఆ రెండు దేశాల తర్వాత మన దేశంలో తెలంగాణలోని ములుగులోనే ఉన్నదని ఆ ప్రకటన పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థని అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం, వాటి ఫలితాలు ప్రజలు చేరువ చేయడం కోసం ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అటవీ కళాశాల, పరిశోధన సంస్థ హైదరాబాద్‌ను పూర్తిస్థాయి అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తున్నారు.

click me!