ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ ముందు షర్మిల కారు డోరును పోలీసులు ఓపెన్ చేశారు. కారులో ఉన్న షర్మిలను పోలీసులు బయటకు తీసుకు వచ్చారు.
హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కారు డోరును పోలీసులు ఓపెన్ చేశారు. కారులో ఉన్న వైఎస్ఆర్‌టీపీ నేతలతో పాటు షర్మిలను పోలీసులు కారు నుండి బయటకు తీసుకు వచ్చారు.నిన్న నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగగిరి వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేట నుండి షర్మిలను హైద్రాబాద్‌లోని లోటస్ పాండ్ కు తరలించారు. ఇవాళ ఉదయం లోటస్ పాండ్ నుండి పోలీసుల కళ్లు గప్పి షర్మిల బయటకు వచ్చారు. యశోద ఆసుపత్రి ప్రాంతం నుండి నిన్న టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో ధ్వంసమైన కారులో ప్రగతి భవన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు.
అయితే పంజాగుట్టవద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల వాహనం ముందుకు వెళ్లకుండా పోలీసులు తమ వాహానాలను నిలిపివేశారు. తనను సీఎంను కలిసేందుకు అనుమతివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కారులోనే కూర్చున్నారు. అయితే ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు క్రేన్ సహయంతో షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు కారులోనే షర్మిల కూర్చుంది. కారు నుండి దిగాలని ఆమెను కోరినా ఆమె మాత్రం పట్టించుకోలేదు. దీంతో కారు డోర్ లాక్ ను పగులగొట్టి కారులో ఉన్న వైఎస్ఆర్‌టీపీ నేతలను బయటకు దింపారు. ఆ తర్వాత షర్మిలను కారు నుండి బయటకు తీసుకు వచ్చారు. ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ లోకి మహిళా పోలీసులు షర్మిలను తీసుకెళ్లారు.
నిన్న నర్సంపేటలో షర్మిల బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. అంతేకాదు ఈ బస్సుకు నిప్పంటించారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో కారు కూడా ధ్వంసమైంది. ఈ వాహనాలతో ప్రగతి భవన్ వైపునకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించారు. దీంతో షర్మిలను అడ్డుకొని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను విడుదల చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ కు సమీపంలోని నాలుగు అంతస్థుల భవనంపై ఎక్కిన కొందరు ఆందోళనకు దిగారు. షర్మిలను విడుదల చేయకపోతే తాము భవనం నుండి కిందకు దూకుతామని హెచ్చరించారు. ఈ భవనంపైకి ఎస్ఓటీ పోలీసులు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్ వద్ద ఎవరూ ఉండవద్దని పోలీసులు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన వారిని పోలీసులు పంపిస్తున్నారు. షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ పీఎస్ ఎదురుగా ఉన్న భవనంపై ఆందోళనకు దిగిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.