సోమాజిగూడలో షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. ఆమె ఉన్న కారును క్రేన్‌తో లిఫ్ట్ చేసి తరలింపు.. తీవ్ర ఉద్రిక్తత..

By Sumanth KanukulaFirst Published Nov 29, 2022, 1:07 PM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు సోమాజిగూడ వద్ద అడ్డుకున్నారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసులు తన పాదయాత్రను అడ్డుకోవడంపై  నిరసనగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు యత్నించారు. వైఎస్ షర్మిల కూడా ప్రగతి భవన్‌ వైపు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ఆమెను సోమాజిగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే షర్మిల సోమవారం టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో అద్దాలు పగిలిన కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్‌ వైపు రావడం.. పోలీసులు ఎంత చెప్పినా ఆమె కారులోని దిగేందుకు నిరాకరించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

షర్మిలను సోమాజిగూడలో అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని షర్మిలను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. అయితే షర్మిల మాత్రం కారు డోర్ లాక్ చేసుకుని లోపలే ఉండిపోయారు. మరోవైపు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు షర్మిలకు మద్దతుగా నినాదాలు చేశారు.

 

అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు.. షర్మిల కారులో ఉండగానే క్రేన్‌తో లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఆ సమయంలో షర్మిల డ్రైవింగ్ సీటులోనే  కూర్చొని ఉన్నారు. పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా కారులోనే ఉన్నారు. అక్కడి నుంచి షర్మిల కారును ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

ఇక, నర్సంపేటలోని లింగగిరి గ్రామంలో సోమవారం వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం షర్మిల పాదయాత్రలో ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల నైట్ హాల్ట్ చేస్తున్న బస్సుకు నిప్పుపెట్టిన టీఆర్ఎస్ శ్రేణులు.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను నైట్ హాల్ట్‌కు వినియోగించే బస్సును టీఆర్ఎస్ గుండాలు తగలబెట్టారని అన్నారు. తమ వాళ్లపై దాడులు కూడా చేశారని ఆరోపించారు. విజయవంతంగా సాగుతున్న పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించి.. తనను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. తాను పాదయాత్రను కొనసాగిస్తానని చెప్పారు. 

అయితే షర్మిల పాదయాత్ర చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నర్సంపేట పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.  అరెస్టును అడ్డుకునేందుకు పార్టీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అనంతరం షర్మిలను లోటస్‌పాండ్‌ను ఆమె నివాసానికి తరలించారు. అయితే ఈ క్రమంలో తన మొహంపై గాయమైందని కూడా షర్మిల చెప్పారు. ఇక, నిన్నటి ఘటనకు నిరసనగా ఈ రోజు ఉదయం షర్మిల ప్రగతి భవన్‌ వైపు బయలుదేరారు. 

click me!