బంగారు తెలంగాణ కాదు...కేసీఆర్ పాలనలో బార్లు, బీర్ల తెలంగాణ: వైఎస్ షర్మిల ఫైర్

Published : Jun 23, 2022, 01:19 PM IST
బంగారు తెలంగాణ కాదు...కేసీఆర్ పాలనలో బార్లు, బీర్ల తెలంగాణ: వైఎస్ షర్మిల ఫైర్

సారాంశం

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ప్రజాప్రస్థాన పాదయాత్ర చేపట్టిన వైఎస్ షర్మిల సిరిపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్కూళ్లో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయంటూ కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. 

సూర్యాపేట : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ కనీస వసతులు కల్పించడంలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. చివరకు మంచి నీళ్లు కూడా ఇవ్వడంలేదంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా వుందో అర్థంచేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మంచి నీళ్ళు దొరకడం లేదు... కానీ మద్యం ఏరులై పారుతోందన్నారు. గుడులు బడుల కన్నా వైన్స్ షాపులు, బెల్ట్ షాపులే తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేసారు. బంగారు తెలంగాణ అని చెప్పి చివరకు బార్లు, బీర్ల తెలంగాణగా మార్చారని సీఎం కేసీఆర్ పై షర్మిల సెటైర్లు విసిరారు. 

వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నడిగుడెం మండలంలోని సిరిపురం గ్రామంలో పాదయాత్ర చేపట్టిన షర్మిల   ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. క్లాస్ రూం లను పరిశీలిస్తూ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించిన షర్మిల వాటి అధ్వాన్న స్థితిపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు రావడం లేదని... తామే చందాలు వేసుకుని స్కావెంజర్ ను పెట్టుకోవాల్సి వస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. 

విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన షర్మిల అసహనం వ్యక్తం చేసారు. విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడతారా? అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలో ఇంతకన్నా మంచి భోజనం పెట్టలేమని సిబ్బంది షర్మిల ఎదట వాపోయారు. 

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పథకాలు లేవు కానీ పన్నులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విద్యావ్యవస్థ అధ్వాన్నంగా తయారయ్యిందని... సిరిపురం మండల ప్రాథమిక పాఠశాలను చూస్తే ఇది అర్థం అవుతుందన్నారు. పాఠశాలలో విధ్యార్థులకు సరిపడా ఉపాద్యాయులు లేరు... మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. ఇక మధ్యాహ్న భోజనం పిల్లలు తినేలా లేదన్నారు. 

చివరకు మరుగు దొడ్ల క్లీనింగ్ కోసం ఉపాద్యాయులు చందాలు వేసుకునే పరిస్థితి తెలంగాణ పాఠశాలల్లో వుందన్నారు.  భవనాలు కూలిపోయే పరిస్థితిలో వున్నాయని...అయినా పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.  అసలు ప్రభుత్వ పాఠశాలలు అంటేనే కేసీఆర్ కు లెక్క లేదని షర్మిల అన్నారు.

సీఎం కేసీఆర్... ఆయన బిడ్డలు... కుటుబం...టీఆర్ఎస్ నాయకులు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాగుపడ్డారని... ఉధ్యమకారులెవ్వరూ బాగుపడలేదని షర్మిల అన్నారు. కేవలం డబ్బు సంపాదించుకోవడమే కేసీఆర్ సింగిల్ అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బాధిత కుటుంబాలను సీఎం కేసీఆర్, మంత్రులు కనీసం పరామర్శించలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. 


 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!