
ఖమ్మం: తెలంగాణలో మరోసారి ఆర్టీసి ఛార్జీలు పెరగడం (TSRTC Charges Hike)పై స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ధ్వజమెత్తారు. దివంగత వైఎస్సార్ పాలనతో నేటి కేసీఆర్ పాలనను పోలిస్తే నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లు కేసీఆర్ తీరు వుందని ఎద్దేవా చేసారు. వైఎస్సార్ దేవుడైతే కేసీఆర్ దెయ్యం... పాలించడంలోనూ దేవుడికి దెయ్యానికి ఉన్నంత తేడా ఉందన్నారు. వైఎస్సార్, కేసీఆర్ పాలనకు ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉంటుందని షర్మిల ధ్వజమెత్తారు.
తెలంగాణ వ్యాప్తంగా కాలిబాటన తిరిగి ప్రజా సమస్యలు, రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్ షర్మిల మహాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వైరా నియోజకర్గంలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా తాజాగా రాష్ట్రంలో డీజిల్ సెస్ పేరిట ఆర్టీసి చార్జీల పెంచి సామాన్య ప్రయాణికులపై మరింత భారం మోపడంపై షర్మిల సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్ పాలన కొనసాగినంత కాలం ఒక్కసారి కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని షర్మిల పేర్కొన్నారు. ఇలా ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపకుండా ఆర్టీసీని ఆదుకున్న ఘనత దివంగత వైఎస్సార్ కి మాత్రమే దక్కుతుందన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో మరోసారి ఆర్టిసి ఛార్జీలు పెంచి సీఎం కేసీఆర్ సామాన్య ప్రయాణికుల నడ్డి విరిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెరిగిన ఛార్జీలను చూస్తేనే భయంగా వుందని... ఇలా కేసీఆర్ సర్కార్ ప్రజలపై పెనుభారం మోపడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఆర్టీసీ చార్జీలే కాదు... రాష్ట్రంలో ఏవి చూసినా అన్ని మోతే. ఇలా అన్ని వర్గాలను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అంటూ షర్మిల విరుచుకుపడ్డారు.
''మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి వైఎస్సార్. ఒక్క మాట కూడా నిలబెట్టుకోని వ్యక్తి కేసీఆర్. మాట ఇచ్చాడు అంటే వైఎస్ఆర్ చేసి చూపించాడు. కాబట్టే ఆయన హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. కానీ నేడు కేసీఆర్ పాలనలో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు'' అని షర్మిల పేర్కొన్నారు.
''మన ప్రభుత్వం వచ్చిందంటే అది మీ ప్రభుత్వమే. అప్పుడు తెలంగాణలో తిరిగి వైఎస్సార్ పథకాలు అన్నింటినీ అమలు చేసుకుందాం. మహిళలకు ఆర్థికంగా పెద్దపీట వేద్దాం. ఇక్కడ ఉన్నది పులి బిడ్డ. ఆ పులి బిడ్డగా మాట ఇస్తున్నా... వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ అంటే ఎంటో చూపిస్తా'' అని షర్మిల హామీ ఇచ్చారు.
''ప్రస్తుతమున్నది బంగారు తెలంగాణ కాదు... బ్రతుకు లేని తెలంగాణ. ఇది అప్పుల తెలంగాణ... ఆత్మహత్యల తెలంగాణ. వైఎస్సార్ హయాంలో 46 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్ళు ఇచ్చారు. కేసీఆర్ పాలన లో ప్రజల ఆస్థులు పెరగకపోగా..అప్పుల పాలు అయ్యారు. కేసీఆర్ ను ప్రశ్నించే ప్రతిపక్షాలు నిద్రపోయాయి. అందుకే పార్టీ పెట్టాం... ప్రజల తరుపున పోరాడుతున్నాం'' అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.