షర్మిల తెలంగాణలో పుట్టలేదనే వాదనలో పస లేదు: వైఎస్ విజయలక్ష్మి

By narsimha lodeFirst Published Jul 8, 2021, 5:40 PM IST
Highlights

 వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు కార్యక్రమం హైద్రాబాద్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తెలంగాణకు వైఎస్ఆర్ ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టారో ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు కూడ వైఎస్ఆర్ ను అక్కున చేర్చుకొన్న విషయాన్ని ఆమె మననం చేసుకొన్నారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ రాకముందు తెలంగాణ పొలాల్లో రక్తపు మరకలుంటే వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంత పొలాల్లో నీళ్లు పారాయని వైఎస్ఆర్ సతీమణి  వైఎస్ విజయలక్ష్మి చెప్పారు. తమ కుటుంబానికి దాచుకోవడం  దోచుకోవడం తెలియదని ఆమె తేల్చి చెప్పారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పుట్టలేదనే వాదనలో పస లేదని విజయమ్మ అన్నారు. వైఎస్ జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాలకు, వేర్వేరు పార్టీలకు ప్రతినిధులని ఆమె అన్నారు. 

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని  గురువారం నాడు హైద్రాబాద్ ఓ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు.ఈ మూడు నెలల్లో తన కూతురు షర్మిలపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు ఆరోపణలు, దుష్ప్రచారాలు జరిగాయన్నారు. తన బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరణం లేని నాయకుడు వైఎస్ఆర్ అని ఆమె చెప్పారు. అందరితో మమేకమైన నడిచేవారే నిజమైన నాయకుడని ఆమె తెలిపారు.తెలుగువారి గుండెచప్పుడు వైఎస్ఆర్ అని  ఆమె గుర్తు చేసుకొన్నారు. 

అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణకే వైఎస్ఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆమె చెప్పారు. వైఎస్ఆర్  చనిపోయిన సమయంలో ఎక్కువగా  ఈ ప్రాంతంలోనే ఆయన అభిమానులు కూడ మరణించారన్నారు.  ఎంతమంది వైఎస్ఆర్ ను ఇబ్బంది పెట్టినా కూడ  తెలంగాణ ప్రజలు  ఆయన వెంట ఉన్నారని ఆమె ఈ ప్రస్తావించారు. 

వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టులు తెలంగాణలో ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. వైఎస్ కల అసంపూర్తిగా మిగిలిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తశుద్ది, పట్టుదలలో వైఎస్ వారసులు జగన్, షర్మిలలు అని ఆమె చెప్పారు.  నాన్న ఆశయాలు, సాధన కోసం షర్మిల రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. ఏదైనా మంచి చేయాలని భావిస్తే ఆ పనిని పూర్తి చేసేవరకు నిద్రపోదని షర్మిల గురించి చెప్పారు.

జగన్ కోరిక మేరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 3 వేలకు పైగా పాదయాత్ర నిర్వహించిందని ఆమె గుర్తు చేశారు.తెలంగాణ రాజన్న రాజ్యం రావాలని షర్మిల కోరుకొంటుందన్నారు.జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉన్నారని, ఇది దైవ నిర్ణయంగా ఆమె పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలుంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.

click me!