జగన్ మీద అలకపై వైఎస్ షర్మిల క్లారిటీ: కృష్ణా జలాలపై వైఖరి స్పష్టం

By telugu teamFirst Published Jul 16, 2021, 5:08 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద అలక వహించి తెలంగాణలో పార్టీ పెట్టారా అని అడిగితే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన రీతిలో స్పందించారు. కృష్ణా జలాలపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు.

హైదరాబాద్: తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తాను అలిగినట్లు జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో కృష్ణా జలాల వివాదంపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జనగ్ మీద తాను అలిగి పార్టీ పెట్టానని కొందరు అంటున్నారని, అది సరి కాదని, అలిగితే మాట్లాడడం మానేస్తారు గానీ పార్టీ పెడుతారా అని ఆమె అన్నారు. 

తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం చేయాలని పార్టీ పెట్టామని ఆమె చెప్పారు. వైఎస్సార్ టీపీ తన కోసం పెట్టిన పార్టీ కాదని, తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పెట్టామని ఆమె అన్నారు. టీఆర్ఎస్, బిజెపి కుమ్మక్కయ్యాయని, హుజూరాబాద్ ఎన్నికకు అర్థమే లేదని ఆమె అన్నారు. 

ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోందని, ఒక వేళ రాజన్న రాజ్యం రాకపోతే తెలంగాణలో ప్రజలే తిరుగుబడుతారని, అందులో సందేహం అక్కర్లేదని వైఎస్ షర్మిల అన్నారు. తాము రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, తమ పరిధులకు తాము కట్టుబడి ఉన్నామని ఆమె స్ప,ష్టం చేశారు. 

దివంగత నేత వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకి కాదని వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ  వైఎస్‌ తెలంగాణకు మంచి చేశారా..ద్రోహం చేశారా..గ్రామాలకు వెళ్లి అడగాలని అన్నారు. వైఎస్‌ చనిపోయాకే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని తెలిపారు. మా నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని షర్మిల అన్నారు. ‘‘తెలంగాణ నా గడ్డ.. ఇది రియాలిటీ’’ అని తెలిపారు. 

ప్రజల కోసం నిలబడే.. పోరాడే పార్టీ వైఎస్సార్‌ టీపీ అని స్పష్టం చేశారు. అలిగితే పుట్టింటికి వెళ్లకుండా పార్టీ పెడతామా అని ప్రశ్నించారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందా అని నిలదీశారు. తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది.. పెట్టామని వైఎస్సార్‌ టీపీ అధినేత తెలిపారు. 

కృష్ణా జలాల అంశాలను కేసీఆర్‌ ఏనాడైనా సీరియస్‌గా తీసుకున్నారా అడిగారు. సమావేశాలకు పిలిస్తే పోవాల్సిన బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును వదులుకోమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో ఎంత మంది మహిళలున్నారని.. మీటింగ్‌ జరిగితే మహిళా సర్పంచ్‌కు కూడా కుర్చీ ఇవ్వరని విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలని..వ్రతాలు చేసుకోవాలి షర్మిల వ్యాఖ్యానించారు.

click me!