
కరీంనగర్: తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో మాల, మాదిగలతో పాటు మొత్తం 59ఉప కులాలకు ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మార్ఫిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. భూమి కేటాయించకుంటే హుజురాబాద్ ఉపఎన్నికలో దళితుల ఓట్లు అడిగే నైతిక హక్కును కోల్పోతుందని కృష్ణ మాదిగ హెచ్చరించారు.
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలకేంద్రంలోని సౌభాగ్య లక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన హైటెక్ సిటీలోని భూములను వెలమ, కమ్మ, బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాలకు మాత్రమే అప్పగిస్తోందన్నారు. హైటెక్ సిటీలో ఎకరం భూమి విలువ వంద కోట్ల పైచిలుకు విలువ ఉందని... అలాంటి భూములను మాల, మాదిగ సామాజివర్గాలకు కేటాయించి దళిత సాధికారత గురించి మాట్లాడాలన్నారు.
''బిసిలకు హైద్రాబాద్ బార్డర్లో ఎకరం, రెండు ఎకరాలు, మూడు ఎకరాల చొప్పున కేటాయించారు. మాదిగ, మాలలతో పాటు 59ఉప కులాలకు ఎక్కడ కూడ సెంట్ భూమి కేటాయించలేదు. దీన్ని బట్టి చూస్తే దళిత సాధికారత ఎంత బూటకమో తెలుస్తుంది. ఓట్ల కోసం ఎన్ని జిమ్మిక్కులు చేస్తుండో ఆర్ధం అవుతుంది. నీ వెలమ కులస్తులకు వందల కోట్ల భూములు. ప్రజా ధనం ఇష్టం వచ్చినట్లు దుర్వినీయోగం చేస్తవు... కానీ దళితులకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వవా?'' అని సీఎం కేసీఆర్ ను నిలదీశారు.
''హైటెక్ సిటీ లో దళిత కులాలకు ఐదు ఎకరాల చొప్పున భూములు కేటాయించాలి. అంతేకాదు ఆ భూముల్లో భవనాన నిర్మాణం కోసం పది కోట్లు చొప్పున కేటాయించాలి. భవనాలకు భూములు కేటాయించకుండా వచ్చి ఓట్లు అడిగితే దళితుల తిరుగు బాటు ఎట్లా ఉంటుందో చూపిస్తాం'' అని హెచ్చరించారు.
read more నీకు చీము, నెత్తురు వుంటే... సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి తీసుకోకు: రసమయిపై మందకృష్ణ వ్యాఖ్యలు
''అన్ని రంగాల్లో అగ్ర వర్ణాలదే ఆధిపత్యం. మాదిగలు, మాలలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత లేకుండా పోతుంది. తెలంగాణ లో ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీల జనాభ 93శాతం ఉంది. అందరు ఏక తాటి పైకి వచ్చి మన ఓటు మనం వేసుకుంటే దొరల రాజ్యం తొలగించవచ్చు. పేదల రాజ్యం స్థాపించవచ్చు. హుజురాబాద్ ఉప ఎన్నికలో దొరలు, దొరల ప్రతినిధులను ఓడించడానికి మన అందరం సంఘటిత పడాలి'' అని కృష్ణ మాదిగ సూచించారు.