వైఎస్ అభిమానులతో రేపు వైఎస్ షర్మిల భేటీ: కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమా?

By telugu teamFirst Published Feb 8, 2021, 5:33 PM IST
Highlights

కొత్త పార్టీ పెడుతారనే ప్రచారం నేపథ్యంలో రేపు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల వైఎస్ అభిమానులతో భేటీ కాబోతున్నారు. రేపు లోటస్ పాండ్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు వైఎస్ అభిమానులకు ఫోన్లు వెళ్తున్నాయి.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రేపు మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ మీద ఆసంతృప్తితో ఆమె తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించాలని అనుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. 

వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను ఈ సమావేశానికి ఆమె ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ అభిమానులకు ఈ మేరకు ఫోన్లు వెళ్తున్నాయి. అయితే, షర్మిల సమావేశం అజెండా మాత్రం బయటకు రాలేదు. చాలా కాలంగా వైఎస్ షర్మిల జగన్ మీద ఆసంతృప్తితో ఉన్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. షర్మిల ముందుకు రావడంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేత చక్రం తిప్పినట్లు చెబుతున్నారు.

రేపు ఉదయం 10 గంటలకు ఆమె ఈ ఆత్మియ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణను పూర్తిగా వదిలేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. అకస్మాత్తుగా ఈ సమావేశం ఎందుకు పెడుతున్నారనేది మాత్రం తెలియడం లేదు. అయితే, కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారనే ఊహాగానాలు మాత్రం చెలరేగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

నాయకులు, కార్యకర్తల జాబీతా షర్మిల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా పార్టీ పెట్టాలనే కసరత్తు పూర్తయినట్లు చెబుతున్నారు. తెలంగాణను వైసీపీ వదిలేసిన స్థితిలో ఈ రాష్ట్రంలో వైఎస్ అభిమానులను, వైసీపీ నేతలనూ కార్యకర్తలను చేరదీసి పార్టీని నడిపించాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ ఇటీవల పులివెందులలో ఉన్నప్పుడు షర్మిల పక్కన కనిపించలేదు. దాంతో వైఎస్ జగన్ తో షర్మిల తీవ్రమైన ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ ప్రమేయం ఉండకూడదనే ఉద్దేశంతో జగన్ షర్మిలను, విజయలక్ష్మిని దూరంగా ఉంచినట్లు చెబుతున్నారు. 

తనను వైఎస్ జగన్ రాజకీయాలకు దూరంగా ఉంచినందుకు ఆమె కినుక వహించినట్లు సమాచారం. వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు ఆమె యాత్రలు చేస్తూ పార్టీని కాపాడారని, అయితే ఆ తర్వాత షర్మిలను జగన్ పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో ఆమె కొత్త పార్టీ స్థాపించి తెలంగాణలో తన సత్తా చాటాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 

వైఎస్ షర్మిలకు తల్లి వైఎస్ విజయమ్మ ఆశీస్సులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల పార్టీ పెడుతారని మీడియాలో వార్తలు వచ్చినప్పుడు ఆమె పేర ఓ ఖండన విడుదలైంది. ఆ ఖండనను పటాపంచలు చేస్తూ ఆమె ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

click me!