
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ పోలీసులను జీతగాళ్లుగా, పార్టీ కార్యకర్తల మాదిరిగా వాడుకుంటుందని ఆరోపించారు. వైఎస్ షర్మిల శుక్రవారం డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు క్రూరత్వం గురించి డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసుల టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే వర్తిస్తుందని.. సామాన్యుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారని కూడా తెలియజేశామని చెప్పారు. తాము ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఎల్లుండి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నానని చెప్పారు. ఎక్కడ పాదయాత్ర ఆగిందో.. ఇప్పుడు అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి మొదలుపెడతానని అన్నారు. డిసెంబర్ 14వ తేదీన పాదయాత్ర ముగించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో తాలిబన్ల రాజ్యం సాగుతుందని అనడానికి ఎలాంటి సంకోచం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు తాలిబన్లేనని విమర్శించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. పాదయాత్రను మాత్రం ఆపేది లేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరితరం కాదన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఉదయించే సూర్యుడు వంటిదని.. చేయి అడ్డుపెట్టినంత మాత్రానా ఆగేది కాదన్నారు. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొచ్చేవరకు తమ పార్టీ పోరాడుతుందన్నారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై తాము మాట్లాడుతూనే ఉంటామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని.. కానీ కుటుంబ ఆస్తులను విపరీతంగా పెంచుకుందని విమర్శించారు. తమ పాదయాత్ర అడ్డుకున్న నేపథ్యంలోనే తాము గవర్నర్‌ను కలవడం జరిగిందన్నారు. దీనిపై నివేదికపై తెప్పించుకోవాలని కోరినట్టుగా చెప్పారు.
జగ్గారెడ్డి కామెంట్స్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాను ఎలాంటి విచారణలకైనా సిద్దమని చెప్పారు. కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై తాను చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డికి గానీ, వాళ్ల అయ్యాకు గానీ ఇదే సమాధానం అని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని.. దానిని ఏపీలో కలపడం సాధ్యమయ్యే పనా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ది కోసం, ప్రజల కోసం పెట్టిన పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని అన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరని అన్నారు. తాను బీజేపీకి దత్తపుత్రిక ఎలా అవుతానని ప్రశ్నించారు. పలు అంశాలపై బీజేపీని ప్రశ్నిస్తున్న రాష్ట్రంలో ఏకైక పార్టీ తమదేనని అన్నారు. ఇన్నేళ్లు బీజేపీతో కేసీఆర్ డ్యూయెట్‌లు పాడుకుంటూ తిరగాడని విమర్శించారు. బీజేతో పాటలు పాడుకుంటూ, డ్యాన్స్‌లు చేసకుంటూ తిరిగిన కేసీఆర్‌ను బీజేపీ పెళ్లామనాలా? అని ప్రశ్నించారు. అవినీతిని ఎత్తి చూపడం తప్పా అని ప్రశ్నించారు. ఇవి మన రాష్ట్ర సమస్యలు కావా? అని అడిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో పాటు, కేటీఆర్ రియల్ ఎస్టేట్ దందాపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం మీద విచారణ జరిపించాలని అన్నారు.
‘‘నేను నిన్న మాట్లాడినప్పుడు ఒక మాటను నేను అనలేదని చెప్పినట్టుగా ఉన్నాను. ఎక్కడి నుంచో తీసి ఆ వీడియో ప్లే చేస్తున్నారు. నా దృష్టికి కూడా వచ్చింది. నేను కూడా ఎక్కడ మాట్లాడానా? అని ఆలోచించాను. నా మైండ్‌లో స్లిప్ అయినట్టుంది.. దానికి అపాలజీస్. మా వాళ్లను అది ఎక్కడ మాట్లాడిందో తీయమంటే తీశారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న సమయంలో.. కేటీఆర్ వ్రతాలు చేసకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎద్దేవా చేసేలా అధికారం పక్షంలోని నేతలు మాట్లాడితే.. అప్పుడు నేను వత్రాలు చేసుకుంటానని మీరు అంటున్నారు కదా.. మీరు నిజంగానే అంతా మొనగాళ్లు అయితే, మగతనం ఉంటే ఉద్యోగాలు ఇచ్చి చూపించడని సవాలు చేశాను. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడే ఉన్నాను’’ అని షర్మిల చెప్పారు. తెలంగాణలో అరాచక పాలన జరుగతుందని విమర్శించారు. తాను ఒక మాట అంటే రోషమస్తుందని.. మిగిలిన వారు బిడ్డలు కాదా అని ప్రశ్నించారు