తమకు వైఎస్ షర్మిల నుంచి పిలుపు వచ్చిందని మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చెప్పారు. అదే సమయంలో షర్మిలపై కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరంగల్: మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల నుంచి పిలుపు వచ్చింది. ఈ విషయాన్ని కొండా సురేఖ భర్త కొండా మురళి ధ్రువీకరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కొండా సురేఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ, టీఆర్ఎస్ లోనూ పనచేశారు ప్రస్తుతం కాంగ్రెసులో ఉఠన్నారు.
షర్మిలపై కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారితే షర్మిల పది వేల కోట్ల రూపాయలు ఇస్తారని, కానీ తమకు విలువలే ముఖ్యం గానీ డబ్బు కాదని ఆయన అన్నారు. షర్మిల నుంచి తమకు పిలుపు వచ్చిందని, అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెసును వీడబోమని తాము చెప్పామని కొండా మురళి చెప్పారు.
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని ఆయన నివాసంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం పార్టీ శ్రేణులతో మురళి, కొండా సురేఖ సమావేశమయ్యారు. ఓటమి భయంతోనే కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా టీఆర్ఎస్ ఎన్నికలు పెట్టిందని కొండా సురేఖ విమర్శించారు. త్వరలో వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఈసీ నుంచి షెడ్యూల్ కూడా విడుదలైంది.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసి, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఢీకొట్టడానికి సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. షర్మిల ఇటీవల హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగ దీక్ష చేశారు