రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దాం : జగన్ కు కేసీఆర్ స్నేహహస్తం

By Nagaraju penumalaFirst Published 25, May 2019, 8:35 PM IST
Highlights

రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దామంటూ జగన్ కు స్నేహహస్తం అందించారు. గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టిఎంసిలు నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టిఎంసిలు మాత్రమే వాడుకోగలదని మిగిలిన నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుందని సూచించారు. 
 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మంచి సత్సంబంధాలతో వ్యవహరిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని ఆయన చెప్పుకొచ్చారు. 

గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని సిఎం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. 

ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సిఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు. తాను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిశానని చెప్పుకొచ్చారు. 

దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ – మహారాష్ట్రల మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై తానే చొరవ తీసుకుని మాట్లాడానని చెప్పుకొచ్చారు. లివ్ అండ్ లెట్ లివ్ తమ విధానమని చెప్పానని గుర్తు చేశారు. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని సూచించినట్లు తెలిపారు. 

దాంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చిందని ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది తమ విధానమని కేసీఆర్ జగన్ తో అన్నారు. 

రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దామంటూ జగన్ కు స్నేహహస్తం అందించారు. గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టిఎంసిలు నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టిఎంసిలు మాత్రమే వాడుకోగలదని మిగిలిన నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుందని సూచించారు. 

ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చన్నారు. దీంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని తెలిపారు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చని జగన్ కు తెలియజేశారు. 

గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వవచ్చని కేసీఆర్ సూచించారు. దీంతో త్వరలోనే ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని జగన్న కేసీఆర్ నిర్ణయించారు. అంతకుముందు సతీసమేతంగా ప్రగతిభవన్ కు వచ్చిన జగన్ దంపతులకు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. 

అనంతరం జగన్ ను ఆలింగనం చేసుకుని వెల్ కమ్ చెప్పారు. పోచంపల్లి ఇక్కత్ శాలువాకప్పి సన్మానించారు. కరీంనగర్ పిలిగ్రీ జ్ఞాపిక బహుకరించారు. సిఎం బాధ్యతల్లో విజయవంతం కావాలని జగన్ ను దీవించారు. స్వీటు తినిపించి సంతోషం పంచుకున్నారు. 

రాష్ట్ర మంత్రులను, ఇతర ప్రముఖులను జగన్ కు పరిచయం చేశారు. జగన్ భార్య భారతీరెడ్డికి కేసీఆర్ సతీమణి శోభారాణి, కేటీఆర్ సతీమణి శైలిమ స్వాగతం పలికారు. 
జగన్ వెంట ఆంధ్రప్రదేశ్ ఎంపిలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రగతి భవన్ కు తొలిసారి జగన్: కేసీఆర్ తో భేటీ

సతీసమేతంగా ప్రగతిభవన్ కు జగన్: కేసీఆర్ ఆలింగనం, కాళ్లుమెుక్కిన విజయసాయి

Last Updated 25, May 2019, 8:35 PM IST