ప్రగతి భవన్ కు తొలిసారి జగన్: కేసీఆర్ తో భేటీ

By telugu teamFirst Published May 25, 2019, 5:38 PM IST
Highlights

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ కు, కేసీఆర్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీ రామారావు లోటస్ పాండుకు వెళ్లి జగన్ ను కలిశారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజభవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారిక నివాసం ప్రగతి భవన్ లో జగన్ కాలు పెట్టడం ఇదే మొదటిసారి.  జగన్ కు కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్ తో జగన్ భేటీలో కేటీఆర్ తో పాటు సీనియర్ నేత కె. కేశవరావు, మంత్రులు ఉన్నారు. 

తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్ కేసీఆర్ ను అహ్వానించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ కు, కేసీఆర్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీ రామారావు లోటస్ పాండుకు వెళ్లి జగన్ ను కలిశారు. 

ఆ తర్వాత జగన్ తో కేసీఆర్ భేటీ అవుతారని, తాడేపల్లిలోని జగన్ గృహ ప్రవేశానికి కేసీఆర్ హాజరవుతారని వార్తలు వచ్చాయి. అయితే, కేసీఆర్ తో జగన్ మధ్య నెలకొన్న సయోధ్యను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఇరువురి మధ్య భేటీ జరగలేదని అంటున్నారు. 

తన పార్టీ వైసిపి తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధించి, తాను ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో కేసీఆర్ తో భేటీకి ఏ విధమైన ఆటంకాలు ఉండవని జగన్ భావించారు. పైగా, ఇరు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక, ప్రశాంత వాతావరణం అవసరమని చెప్పడానికి జగన్ కు అవకాశం చిక్కింది. దీంతో ఆయన నేరుగా కేసీఆర్ తో భేటీకి సిద్ధపడ్డారు. 

click me!