బర్రెను అమ్మారని గుండు గీశారు... అవమానంతో యువకుడు..

By telugu teamFirst Published May 18, 2019, 8:54 AM IST
Highlights

గ్రామ సర్పంచి భర్త ఇచ్చిన తీర్పు... ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేలా చేసింది.  కాగా.. యువకుడు రాసిన ఆత్మహత్య లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. 

గ్రామ సర్పంచి భర్త ఇచ్చిన తీర్పు... ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేలా చేసింది.  కాగా.. యువకుడు రాసిన ఆత్మహత్య లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ దారుణ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముచ్చింతల గ్రామానికి చెందిన రాఘవేందర్‌, మహేశ్వర్‌రెడ్డి స్నేహితులు. మహేశ్వర్‌రెడ్డి ఓ ప్రైవేటు ఉద్యోగానికి డబ్బు కట్టే నిమిత్తం తండ్రికి తెలియకుండా ఇంట్లోని బర్రెను, దూడను అమ్మేందుకు నిర్ణయించుకున్నాడు. సహాయంగా రాఘవేందర్‌ను పిలిచాడు. ఇద్దరూ దేవరకద్ర సంతలో పశువులను అమ్మేసి తిరిగి వచ్చారు. 

కొడుకు చేసిన పనికి కోపం వచ్చిన మహేశ్వర్ రెడ్డి తండ్రి.. ఈ విషయాన్ని గ్రామ సర్పంచి భర్త హర్షవర్ధన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన పంచాయతీ పెట్టి.. ఇద్దరికీ గుండు గీయించి మరోసారి తప్పు చేయొద్దని హెచ్చరించారు. తనకు ఏ పాపం తెలియదని, కేవలం స్నేహితుని వెంట మాత్రమే వెళ్లానని రాఘవేందర్‌ ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. అయినా.. అతనికి కూడా గుండు గీశారు. 

దీన్ని తీవ్ర అవమానంగా భావించిన రాఘవేందర్‌ ఇంటికి వెళ్లాక ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి పెట్టి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. ఊరి చివర వాగు వద్ద రాఘవేందర్‌ను గుర్తించి పట్టుకున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లింది. విచారణ జరిపి, తీర్పు చెప్పిన హర్షవర్ధన్‌రెడ్డి మీద, గ్రామ సర్పంచి మీద, మరో 9 మంది పెద్దలమీద కేసు నమోదు చేసినట్లు భూత్పూర్‌ సీఐ పాండురంగారెడ్డి తెలిపారు.

click me!