
పెదనాన్న కూతరు అంటే వరసకు సోదరి అవుతుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోమని వేధించాడు ఓ యువకుడు. అంతేకాదు.. అడ్డువచ్చిన పెద్దమ్మపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన రమేష్ (26) సొంత పెదనాన్న కుమార్తె(19)ను ప్రేమిస్తున్నానంటూ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. కుటుంబసభ్యులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. మంగళవారం బాధిత యువతి తన తల్లితో కలిసి శంషాబాద్ గుడికి వెళ్తుండగా.. వాళ్లని అనుసరించాడు.
సమయం చూసుకొని వాళ్లను అడ్డుకున్నాడు. మరోసారి పెళ్లి చేసుకోవాలని కోరారు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో దాడి చేయబోయాడు. వెంటనే ఆమె తల్లి అడ్డుకోవడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్రగాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, రమేష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.