ఆన్‌లైన్ అప్పు: పరువు తీసేసిన రుణ సంస్థ.. ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య

By Siva KodatiFirst Published Dec 17, 2020, 3:44 PM IST
Highlights

ఆన్‌లైన్ అప్పులకు మరో వ్యక్తి బలయ్యారు. గడువు లోగా రుణం చెల్లించలేదన్న కారణంగా అప్పు ఇచ్చిన సంస్థ రుణ గ్రహీత వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో ఓ ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు

ఆన్‌లైన్ అప్పులకు మరో వ్యక్తి బలయ్యారు. గడువు లోగా రుణం చెల్లించలేదన్న కారణంగా అప్పు ఇచ్చిన సంస్థ రుణ గ్రహీత వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో ఓ ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్ పేటకు చెందిన మౌనిక ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తోంది. స్థానికంగా ఎగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. 

తన తండ్రి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోవడం.. అప్పుల్లో నుంచి ఎలా భయటపడాలో తెలియకపోవడంతో ఆయనను అప్పుల బాధ నుంచి బయటపడేయాలని భావించింది. దీనిలో భాగంగా ఓ ఆన్ లైన్ సంస్థ నుంచి ఆమె రుణాన్ని తీసుకుంది.

అందులోనూ అధిక వడ్డీకి.. మరోవైపు కుటుంబ బాధ్యతలు తనపైనే పడ్డాయి. అప్పు అయితే దొరికింది కానీ, గడవులోగా తీర్చడమే ఆమెకు కష్టంగా మారింది. తీసుకున్న మొత్తంలో రూ.3 లక్షల అప్పును మౌనిక తీర్చలేకపోయింది.

సదరు సంస్థ.. యువతి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించింది. అదే సమయంలో యువతి ఫొటోపై డిఫాల్టర్ ముద్ర వేసింది. అక్కడితో ఆగకుండా ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లందరికీ వాట్సాప్ మెసేజ్‌లు పంపింది.

కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికి ఆమె ఫొటోపై అప్పు ఎగ్గొట్టిందనే సమాచారంతో వాట్సాప్ మెసేజ్ పంపింది. మెసేజ్ వచ్చిన వారిలో బంధువులు, తన తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

దీంతో మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరికీ మొహం చూపించలేక కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. చివరికి పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మౌనిక చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. 

click me!