
గద్వాల :ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడి మృతిని ఆమె తట్టుకోలేకపోయింది. ప్రియుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆమె తీవ్ర డిప్రెషన్ కు గురయ్యింది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపంతో ప్రియురాలు కూడా సూసైడ్ చేసుకుంది.ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణంలోని గంటవీధికి చెందిన బోయ రామేశ్వరి(22) డిగ్రీ పూర్తచేసింది. చదవుకునే రోజుల్లో కర్నూల్ కు చెందిన జయంత్ అనే యువకుడిని ఈమె ప్రేమించింది. అయితే కుటుంబ సమస్యలతో జయంత్ గత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రామేశ్వరి బాగా కలత చెందింది.
గాంధీచౌక్ లో ఓ మహిళ బాగోగులు చూసుకునేందుకు సంగీత అనే మరో యువతితో కలిసి రామేశ్వరి పనిచేస్తోంది. వీరిద్దరు కలిసి అజయ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రియుడిని మరిచిపోలేక రామేశ్వరి మనస్థాపంతో దారుణ నిర్ణయం తీసుకుంది.
Read More షాద్‌నగర్ లో దారుణం: భార్యకు విద్యుత్ షాక్ పెట్టి హత్య చేసిన భర్త
గాంధీచౌక్ లో పనిచేస్తున్న ఇంట్లోనే రామేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. నిన్న(మంగళవారం) విధులకు హాజరైన సంగీత ఇంట్లోకి వెళ్లిచూడగా రామేశ్వరి మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులతో పాటు మృతురాలి కుటుంబసభ్యులకు సంగీత సమాచారం అందించింది.
గద్వాల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రామేశ్వరి మృతదేహాన్ని పరిశీలించారు. బాడీని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా హాస్పిటల్ కు తరలించారు. రామేశ్వరి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)