హైదరాబాద్‌లో తొలిసారిగా లిక్కర్ అలర్జీ కేసును డాక్టర్లు గుర్తించారు. చర్మంపై దురదలు, ఎర్రబడటంతో పాటు ఛాతీ పట్టేసినట్లుగా వుండటం దీని లక్షణాలుగా తెలుస్తోంది. మద్యం సేవించినప్పుడు పల్లీలు, బఠానీలు, మాంసాహారం తినడం వల్ల ఇలాంటి పరిస్ధితులు వస్తాయని వైద్యులు తెలిపారు.
మందుబాబులకు షాకిచ్చే న్యూస్. లిక్కర్ వల్ల కూడా అలర్జీ వస్తుందట. మీరు వింటున్నది నిజమే. ఈ తరహా కేసును మన హైదరాబాద్‌లోనే గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన జాన్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఓ పార్టీలో మద్యం సేవించాడు. ఆ తర్వాత తన శరీరం ఏదో మార్పులకు గురవుతున్నట్లుగా గుర్తించాడు. వెంటనే అద్దంలో చూసుకోగా.. చర్మంపై దురదలు, ఎర్రబడటంతో పాటు ఛాతీ పట్టేసినట్లుగా అనిపించింది. దీంతో జాన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నాడు. తదనంతరకాలంలో మరోసారి మద్యం సేవించగా.. తిరిగి అదే అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన జాన్.. వైద్యం కోసం అశ్విని అలెర్జీ సెంటర్‌కు రావడంతో అతనికి పరీక్షలు చేసిన డాక్టర్లు దీనిని ఆల్కహాల్ అలర్జీగా నిర్ధారించారు.
మద్యం సేవించినప్పుడు పల్లీలు, బఠానీలు, మాంసాహారం తినడం వల్ల ఇలాంటి పరిస్ధితులు వస్తాయని వైద్యులు తెలిపారు. ఈ తరహా లక్షణాలు కనిపిస్తే మద్యం తాగకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా అశ్విని అలర్జీ సెంటర్‌కు చెందిన డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ.. లిక్కర్ అలర్జీ అనేది చాలా అరుదైన వ్యాధి అని తెలిపారు. ప్రపంచం మొత్తం ఈ తరహా కేసులు కేవలం 100 వరకు మాత్రమే వుండొచ్చని ఆయన వెల్లడించారు.
ALso Read: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇకపై బార్లలోనూ క్వార్టర్, హాఫ్ బాటిళ్ల అమ్మకాలు..!
ఇదిలావుండగా.. తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇంత వరకు వైన్ షాపుల్లో మాత్రమే అందుబాటులో ఉండే లిక్కర్ క్వార్టర్, హాఫ్ బాటిళ్లు ఇకపై బార్లలోనూ లభించనున్నాయి. దీని కోసం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ నిబంధనల్లో మార్పు తీసుకొచ్చింది. ఇందులో బార్లకు కూడా ఆర్థిక ఊతం అందించేలా పలు నిబంధలను సవరించింది. కరోనా తరువాత ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలోని 1,172 బార్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
అందులో భాగంగా బార్ల లైసెన్సింగ్ విధానాన్ని కూడా సులభం చేసింది. అలాగే బ్యాంకు గ్యారెంటీల తగ్గింపు, లైసెన్స్ రుసుము చెల్లింపుల్లో వెసులుబాటు వంటి చర్యలు తీసుకుంది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు అతి త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్లలో క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి.