తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఏడాది విపక్షాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ పై చేయి సాధించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది విపక్షాలపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై చేయి సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు.
ఈ విషయమై కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సీటును కోల్పోయింది. ఈ సీటును టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. ఆర్టీసీ సమ్మె విషయంలో విపక్షాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచాయి. కానీ, చివరికి ఈ విషయంలో కూడ కేసీఆర్ విపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చారు.
మొత్తంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ దూకుడుకు విపక్షాలు అడ్డు చెప్పలేకపోయాయి. టీఆర్ఎస్ నాయకత్వం త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాలకు మరోసారి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారు.మంత్రివర్గంలో తొలి దశలో కేటీఆర్, హరీష్‌రావుకు చోటు దక్కలేదు.
Also read:Year Roundup 2019:రికార్డు సృష్టించిన ఆర్టీసీ సమ్మె, ఎవరిది పై చేయి
ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ సమయంలో హరీష్ రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి,గంగుల కమలాకర్ ,సత్యవతి రాథోడ్ లకు కేసీఆర్ చోటు కల్పించారు.
ఈ మంత్రివర్గ విస్తరణ సమయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను తప్పిస్తారనే ప్రచారం సాగింది. కానీ, రాజేందర్ ను కేసీఆర్ కేబినెట్ లో కొనసాగించారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ. ప్రస్తుతం ఆ పార్టీలో ఆరుగురు మాత్రమే ఎమ్మెల్యేలు మిగిలారు. 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. శాసనమండలిలో కూడ కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేశారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. సత్తుపల్లి నుండి విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరారు. ఆశ్వరావుపేట నుండి గెలిచిన మచ్చ నాగేశ్వరరావు టీడీపీలోనే ఉన్నారు. బీజేపీ ఒక్క స్థానంలోనే ఈ దఫా విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ తన మంత్రివర్గంలోకి చోటు కల్పించారు.
శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడం, అసెంబ్లీలో కూడ సీఎల్పీని టీఆర్ఎస్ శాసనసభపక్షంలో విలీనం చేయడంపై కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లను గెలుచుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. కానీ, ప్రజలు మాత్రం 9 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ కు కట్టబెట్టారు. నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ, మూడు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొంది.
ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీన జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ స్థానం నుండి 2009 నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ఈ దఫా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఆర్టీసీ సమ్మెకు విపక్షాలు మద్దతును ప్రకటించాయి. పలు రకాలుగా నిరసనలు చేశారు. విపక్షాలు ఆర్టీసీ కార్మికులతో ఆందోళనలు చేశాయి.
అయితే చివరకు ఆర్టీసీ జేఎసీ సమ్మె విరమణకు ముందుకు వచ్చింది.ఆ సమయంలో విపక్షాలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవలేకపోయాయి. ఆర్టీసీ జేఎసీ నాయకత్వంతో పాటు కార్మికుల్లో భరోసాను ఇవ్వలేకపోయినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ కోరడంతో గత నెల 29వ తేదీన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు.ఈ నెల 1వ తేదీన ప్రతి ఆర్టీసీ డిపో నుండి ఐదుగురు ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
ఆర్టీసీ కార్మికులకు వరాలు ప్రకటించారు. ఇంతకాలం పాటు సమ్మెకు వెన్నుదన్నుగా నిలిచిన విపక్షాల కంటే హామీలు కురిపించిన సీఎం కేసీఆర్ పట్ల కార్మికులు విశ్వాసాన్ని ప్రకటించేలా మాట్లాడారు. మహిళ కండక్టర్లకు కూడ కేసీఆర్ వరాలు కురిపించారు. రిటైర్మెంట్ వయస్సును కూడ పెంచారు. ఉద్యోగ భద్రతను కూడ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
9