
అక్టోబర్ 25న (మంగళవారం) సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి బుదవారం (అక్టోబర్ 26) ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్టుగా చెప్పారు. మంగళవారం ఉదయం 8.50 గంటల లోపు ఆలయంలో నిర్విహించే సాధారణ పూజా కార్యక్రమాలు పూర్తవుతాయని వెల్లడించారు. అయితే అక్టోబర్ 25వ తేదీన నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేయనున్నారు. అలాగే 26న నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు.
బుధవారం ఉదయం సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు భక్తులను దర్శనానిని అనుమతించనున్నారు. ఆ తర్వాత యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి. ఇక, సూర్యగ్రహణం కారణంలో రాష్ట్రంలోని ఇతర ఆలయాలను కూడా మూసివేయనున్నారు. గ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలోొ రేపు ఉదయం 8.30 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తామని ఆలయ అర్చకులు ప్రకటించారు.
ఇక, 27 ఏళ్ల తర్వాత దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడడం విశేషం. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కూడా ఇదే. అయితే పాక్షికంగా ఏర్పడనున్న ఈ సూర్యగ్రహణం.. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని ఈశాన్య భాగాలు, పశ్చిమ ఆసియా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రం ప్రాంతాలలో కనిపిస్తుంది. భారతదేశంలోని న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, వారణాసి, మధుర, పూణే, సూరత్, కాన్పూర్, విశాఖపట్నం, పాట్నా, ఊటీ, చండీగఢ్, ఉజ్జయిని, వారణాసి, మధుర.. సహా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఈశాన్య భారతదేశంలోని ఐజ్వాల్, దిబ్రూఘర్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, సిబ్‌సాగర్, సిల్చార్ వంటి కొన్ని ప్రాంతాల నుంచి సూర్యగ్రహణం కనిపించదు.
న్యూఢిల్లీలో సాయంత్రం 04:51 నుంచి 05:42 వరకు, హైదరాబాద్‌లో సాయంత్రం 04:58 నుంచి 05:48 వరకు, కోల్‌కతాలో సాయంత్రం 04:51 నుంచి 05:04 వరకు, ముంబైలో సాయంత్రం 04:49 నుంచి 06:09 వరకు, చెన్నైలో సాయంత్రం 05:13 నుంచి 05:45 వరకు సూర్యగ్రహణం ఉండనుంది.