కాంగ్రెస్ పార్టీని రక్షించుకొనేందుకు మునుగోడుకు రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలను కోరారు. ఇవాళ పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
హైదరాబాద్:ప్రాణమో,ప్రజాస్వామ్యమో తాడో పేడో తేల్చుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మునుగోడుకు రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి సోమవారం నాడు బహిరంగ లేఖ రాశారు.
ఘనమైన పోరాటాల చరిత్రకు వారసులైన మనం భాంచన్ దొరా అని బానిసలవుదామా? నిప్పు కణికలై నిటారుగా నిలబడి కొట్లాడాలో తేల్చుకోవాలన్నారు. కులం,మతం , ఊరు,వాడా పల్లె, పట్నం అనే తేదా లేకుండా మునుగోడుకు రావాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు. మీరే తన బలం అని రేవంత్ రెడ్డి చెప్పారు. తన ధైర్యం మీరేననన్నారు.లాఠీ,తూటా అయినా మీ ముందుంటానని రేవంత్ రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ను ఏకాకుల్ని చేసే కుట్రలను బద్దలు కొట్టేందుకు మునుగోడుకు తరలిరావాలని రేవంత్ రెడ్డి ఆ లేఖలో కోరారు. మీ కోసం మునుగోడులో ఎదురు చూస్తానని రేవంత్ రెడ్డి కార్యకర్తలకు చెప్పారు.
ఆడబిడ్డ అని చూడకుండా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడి జరిగిందని రేవంంత్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్ధే పాల్వాయి స్రవంతిపై దాడికి దిగడం పరిస్థితికి అద్దం పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. మన కుటుంబ సభ్యులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ అస్థిత్వానికి ప్రాణం పోసిన సోనియాగాంధీకి ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాపాడడమే కాంగ్రెస్ చేసిన పాపమా? అని అయన అడిగారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై కుట్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ , బీజేపీలు కలిసి పథక రచన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.దుష్ట శక్తులన్నీ ఏకమై మనల్ని ఏకాకుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు. అధికార, ఆర్ధిక బలాలతో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఉపిరి తీయాలని చూస్తున్నారన్నారు. అంతేకాదు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు..
కాంగ్రెస్ బిక్షతో ఎదిగిన వాళ్లే వెన్నుపోటు పొడిచారన్నారు.సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే పైసాకు కూడా పనికిరానివాళ్లు రాజ్యమేలుతూ మనల్ని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
సీఆర్‌పీఎఫ్ , ఎన్నికల కమిషన్ లాంటి సంస్థలను అడ్డుపెట్టుకొని బీజేపీ ,రాష్ట్రపోలీసులు ,స్థానిక అధికారులతో టీఆర్ఎస్ విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆ లేఖలో ఆరోపించారు.బ్యాలెట్ పేపర్ పై గుర్తులు, యాదాద్రికి ఓటర్లను తీసుకెళ్లి ప్రమాణాలు చేయించడం వంటి అంశాలను రేవంత్ రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు.
also read:మునుగోడులో ధర్మ యుద్ధం జరుగుతుంది: బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. 2018లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాడు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని ఆ పార్టీ బరిలోకి దింపింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో సంభాషణలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. అస్ట్రేలియాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.