ఆదిలాబాద్ మానవ అక్రమ రవాణా కలకలం: ఆదివాసీ మహిళను అమ్మేసిన పోలీస్

By Nagaraju penumalaFirst Published Aug 10, 2019, 3:44 PM IST
Highlights

ఉపాధి చూపెట్టాలని గౌరుభాయ్ అనే మహిళను బాధిత మహిళ ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ హరిదాస్ తాను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మధ్యప్రదేశ్ కు చెందిన లాల్ సేట్ అనే వ్యక్తికి అమ్మేశాడు. కానిస్టేబుల్ హరిదాస్ ఇద్దరు మధ్యవర్తులు వెంకట్, మరో వ్యక్తితో కలిసి బాధిత మహిళను అమ్మేశారు.  
 

ఆదిలాబాద్: ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో అక్రస్థానం కల్పిస్తుంటే కొంతమంది మాత్రం మహిళలను ఒక అంగడి బొమ్మగానే ఇప్పటికీ చూస్తున్నారు. 

ఉపాధి చూపించాలంటూ వెళ్లిన మహిళను అమ్మేశాడో ప్రబుద్ధుడు. ఆదుకోవాల్సింది పోయి ఆమెను అమ్మేసి దోచుకోవాలని ప్రయత్నించిన ఆ కిరాతకుడు పోలీసుల చేతికి చిక్కాడు. ఇంకో విషయం ఏంటంటే రక్షించాల్సిన పోలీస్ ఈ మహిళ అమ్మకంలో కీలక పాత్ర పోషించడం గమనార్హం. 

సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కొమురంభీమం జిల్లాతిర్యాణి మండలం సజాపిడికి చెందిన ఆదివాసీ మహిళను మధ్యప్రదేశ్ కు చెందిన లాల్ షేట్ అనే ఓ వ్యక్తికి లక్ష 30 వేల రూపాయలకు అమ్మేశాడు కానిస్టేబుల్.  

ఉపాధి చూపెట్టాలని గౌరుభాయ్ అనే మహిళను బాధిత మహిళ ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ హరిదాస్ తాను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మధ్యప్రదేశ్ కు చెందిన లాల్ సేట్ అనే వ్యక్తికి అమ్మేశాడు. కానిస్టేబుల్ హరిదాస్ ఇద్దరు మధ్యవర్తులు వెంకట్, మరో వ్యక్తితో కలిసి బాధిత మహిళను అమ్మేశారు.  

బాధిత మహిళను రూ.లక్ష 30 వేలకు కానిస్టేబుల్ హరిదాస్ అమ్మేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధిత మహిళలకు లక్ష 10 వేల రూపాయలను అప్పగించి మిగిలిన 20 వేల రూపాయలను పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తిర్యానీ పోలీసులు కానిస్టేబుల్ హరిదాస్, మధ్యవర్తి వెంకట్, గౌరుభాయ్ అనే మహిళను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

మధ్యప్రదేశ్ లో ఉద్యోగం ఉందంటూ ఆమెకు చెప్పి అడ్రస్ ఇచ్చి ట్రైన్ ఎక్కించి పంపించి వేశాడు కానిస్టేబుల్ హరిదాస్. అయితే అక్కడకు చేరుకున్న బాధిత మహిళ యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేక నానా పాట్లు పడింది. 

కొద్దిరోజుల క్రితం ఆమె అతడి భారి నుంచి తప్పించుకుని పరారైంది. మరోవైపు బాధిత మహిళ తమ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తిర్యాణి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ బండారం బట్టబయలైంది. 

click me!