గాంధీ ఆస్పత్రి వద్ద నిస్సహాయ స్థితిలో ఓ మహిళ అంబులెన్స్ లోనే మరణించింది. రెండు గంటల పాటు ఆమె వైద్యుల స్పందన కోసం అంబులెన్స్ లో నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఆమె ప్రాణాలు విడిచింది.
హైదరాబాద్: తగిన సమయంలో సిబ్బంది స్పందించకపోవడంతో గాంధీ ఆస్పత్రి వద్ద అంబులెన్స్ లోనే ఓ మహిళ మరణించింది. రెండు గంటల పాటు అంబులెన్స్ లోనే మహిళ నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఆమె అంబులెన్స్ లోనే ప్రాణాలు విడిచింది.హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రి వద్ద శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. అక్కడ ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు. అయితే, వెంటనే గాంధీ ఆస్పత్రిలోకి ఆమెను తీసుకుని వెళ్లలేదు. దాంతో ఆమె రెండు గంటల పాటు అంబులెన్స్ లోనే ఉండిపోయింది. చివరకు ప్రాణాలు విడిచింది.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు గురువారం మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. ఇందులో 414 యాక్టివ్ కేసులు. తాజాగా, ఈ రోజు కరోనా వ్యాధితో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో కరోనా వ్యాధితో సంభవించిన మరణాల సంఖ్య 12కు చేరుకుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ వివరాలను వెల్లడించారు
కరోనా వైరస్ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరినవారిలో 45 మంది డిశ్చార్జీ అయినట్లు ఆయన తెలిపారు. రేపటి నుంచి కొత్త కేసులు రాకపోవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు 665 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి కరోనా పాజిటివ్ ఉందని తేలిందని ఆయన చెప్పారు. లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు. లేదంటే చాలా ప్రమాదం జరిగి ఉండేదని ఆయన అన్నారు.
పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 22వ తేదీనాటికి చికిత్స పొందుతున్నవారంతా డిశ్చార్జీ అవుతారని ఆయన చెప్పారు. లక్షణాలుంటే కింగ్ కోఠీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని, గాంధీ ఆస్పత్రి కరోనా వైరస్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తుందని ఆయన అన్నారు. హాట్ స్పాట్ గా ప్రకటించిన ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అవుతాయని ఆయన చెప్పారు. తెలంగాణలో 101 హాట్ స్పాట్స్ ఉన్నాయని ఆయన చెప్పారు.
కేసులు తగ్గుతున్నాయని లైట్ గా తీసుకోవద్దని ఆయన సూచించారు లాక్ డౌన్ నియమాలను ప్రజలు పాటించాలని ఆయన సూచించారు. హాట్ స్పాట్ ప్రాంతాలను అధికారులు దిగ్బంధం చేస్తారని ఆయన చెప్పారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా అక్కడికే అందిస్తారని, బయటకు అసలు వెళ్లడానికి ఉండదని ఆయన చెప్పారు.