ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్ర ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళలు మృతి, మరోకరి పరిస్థితి విషమం

By Sumanth KanukulaFirst Published Aug 29, 2022, 12:49 PM IST
Highlights

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరంలో  27 మందికి  ఆపరేషన్లు చేశారు. అనంతరం వారు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఇంటికి వెళ్లిన వారిలో నలుగురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. అయితే ఆస్పత్రులలో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు చనిపోగా... మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.  

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మాడ్గులకు చెందిన మమత రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఆమె మరణించింది. ఇక, మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుష్మ ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత రెండు రోజులు బాగానే ఉంది. తర్వాత వాంతులు, విరోచనాలతో ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అయితే ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు మహిళలకు కూడా ఆస్పత్రులలో చికిత్స కొనసాగుతుంది. 

అయితే ఇబ్రహీం పట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యు నిర్లక్ష్యంగా కారణంగానే తమ వారు మృతిచెందారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం- సాగర్ హైవేపై ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

ఇక, ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన సమయంలో అందరూ బాగానే ఉన్నారని వైద్యాధికారులు తెలిపారు. ఆపరేషన్‌ చేసిన చోట ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పారు. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాకే ఇంటికి పంపించినట్లుగా తెలిపారు. ఈ ఘటపై వైద్యులతో సమీక్షించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని వెల్లడించారు. 

click me!