హైదరాబాద్‌ ఐకియా స్టోర్‌లో మహిళపై జాత్యహంకార వివక్ష!.. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్.. స్పందించిన కేటీఆర్..

By Sumanth KanukulaFirst Published Aug 29, 2022, 12:06 PM IST
Highlights

హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో జాత్యహంకార వివక్ష ఎదుర్కొన్నట్టుగా ఓ వ్యక్తి ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈ చర్య భయంకరమైనదని.. ఆమోదయోగ్యం కాదని కేటీఆర్ పేర్కొన్నారు.
 

హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో జాత్యహంకార వివక్ష ఎదుర్కొన్నట్టుగా ఓ వ్యక్తి ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తన భార్యపట్ల ఐకియా స్టోర్ సిబ్బంది జాత్యాహంకారం ప్రదర్శించారని అతడు ఆరోపించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో ఐకియా‌ స్టోర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈ చర్య భయంకరమైనదని.. ఆమోదయోగ్యం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. సరైన క్షమాపణ జారీ చేయబడిందని నిర్ధారించుకోవాలని సూచించారు. ‘‘మీ కస్టమర్లందరినీ దయతో గౌరవించేలా మీ సిబ్బందికి అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యమైనది. మీరు త్వరగా సవరణలు చేస్తారని ఆశిస్తున్నాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే.. 
నితిన్ సేతి ప్రొఫైల్ పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్.. హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌లో జాత్యహంకార వివక్ష ఎదుర్కొన్నామని ఆరోపించారు. ‘‘మణిపూర్‌కు చెందిన నా భార్య మాత్రమే ఆమె కొనుగోలు చేసిన వస్తువుల కోసం పరీక్షించబడింది. మా ముందు ఎవరిని తనిఖీ చేయలేదు. ఆపై జాత్యహంకారానికి మద్దతుగా సూపర్‌వైజర్ సిబ్బంది అక్కడికి వచ్చారు. 'అంతర్జాతీయ స్టోర్' నుండి గొప్ప ప్రదర్శన. మరొక సాధారణ రోజుకు శుభాకాంక్షలు’’ అంటూ మండిపడ్డారు. 

‘‘నా భార్య షాపింగ్ బ్యాగ్‌లను తనిఖీ చేసిన వ్యక్తి, మేము అన్నీ కొనుగోలు చేశామని అవహేళనగా నవ్వాడు. అయితే మమ్మల్ని ఎందుకు ఒంటరిగా ఉంచారనే దానిని మాత్రం సమాధానం చెప్పలేదు. అసలు దానిని పట్టించుకోనేలేదు. సూపర్‌వైజర్లు.. మీకు కావాలంటే పోలీసులను పిలవండి. మేము మాట్లాడతామని అన్నారు. అది అక్కడ ముగియలేదు. మన ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ జాత్యహంకారం’’ అని పేర్కొన్నారు. 

 

This is appalling and absolutely unacceptable

Please ensure a proper apology is issued & more importantly educate, sensitise & train your staff to respect all your customers graciously

Hope you will make amends asap https://t.co/l84GimoIrM

— KTR (@KTRTRS)


స్పందించిన ఐకియా..
అయితే ఈ వ్యవహారంపై స్పందించిన ఐకియా ఇండియా.. తమ స్టోర్‌ల వద్ద సమానత్వం మానవ హక్కు అని తాము విశ్వసిస్తామని తెలిపారు. తాము అన్ని రకాల జాత్యహంకారం, పక్షపాతాలను ఖండిస్తున్నామని తెలిపింది. తప్పనిసరి బిల్లింగ్ ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నప్పుడు వారికి కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని పేర్కొంది. ‘‘స్వీయ-చెక్‌ అవుట్ చేసే కస్టమర్‌లు బిల్లింగ్ సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి స్టోర్ నుంచి బయలుదేరే ముందు తుది తనిఖీ కోసం అభ్యర్థించబడతారు. కస్టమర్‌లు రెండుసార్లు ఛార్జ్ చేయడం, ఉత్పత్తులను మళ్లీ మళ్లీ స్కానింగ్ చేయడం మొదలైన వాటికి సంబంధించి ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు’’ అని ఐకియా ఇండియా తెలిపింది. అనేక మంది వ్యక్తుల కోసం మెరుగైన రోజువారీ జీవితాన్ని సృష్టించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అయితే ఐకియా ఇండియా ప్రకటనపై సదరు నెటిజన్ మండిపడ్డారు. కంపెనీ మరింత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందంటూ విమర్శించారు. 

click me!