గొల్లకురుమలను ఎస్సీలో కలపడానికి ప్రయత్నిస్తా.. జమ్మికుంటలో దత్తాత్రేయకు సన్మానం

By telugu teamFirst Published Aug 26, 2021, 5:50 PM IST
Highlights

జమ్మికుంటలో నిర్వహించిన గొల్లకురుమలు ఆత్మీయ సత్కార సభకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. గొల్ల కురుమలు గొర్లు, బర్లకు పరిమితం కావొద్దని పెద్ద చదువులు చదివి ఉన్నతస్థానాలకు చేరాలని సూచించారు. కొమురవెళ్లి మల్లన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. గొల్లకురుమాలను ఎస్సీలో కలపడానికి తన వంతు ప్రయత్నం చేస్తారని తెలిపారు.

కరీంనగర్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హల్‌చట్ చేశారు. ముల్కనూరులో స్వాతంత్ర్య సమరయోధులు పడాల చంద్రయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి జమ్మికుంటలో ఏర్పాటు చేసిన గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభకు హాజరయ్యారు. ఈ సభను డోలు కొట్టి ప్రారంభించారు. జమ్మికుంటలోని శంకర నందన గార్డెన్స్‌లో సభ నిర్వహించారు.

‘ఇంత పెద్ద ఎత్తున తనను సత్కరించినందుకు ధన్యవాదాలు. నన్ను మీ కుటుంబ సభ్యుల్లో ఒకనిగా ఆదరించినందుకు కృతజ్ఞతలు’ అని సత్కార సభలో దత్తాత్రేయ అన్నారు. కొమురవెల్లి మల్లన్న ఆశీర్వాదంతో వర్షాలు సకాలంలో పడి పంట సమృద్ధిగా పండాలని కోరుకుంటున్నట్టు వివరించారు. గొల్లకురుమలు అడిగే వారిగా ఉండకూడదని, ఇచ్చేవారిగా ఉండాలని సూచించారు. అందుకు ఏకైక మార్గం చదువు అని తెలిపారు. 

తాను అతి బీద కుటుంబంలో పుట్టి కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా పెద్ద పదవులు అధిరోహించడానికి కారణం తన చదువేనని దత్తాత్రేయ అన్నారు. అందుకే పిల్లలను పెద్ద చదువులు చదివించాలని కోరారు. ఈ సందర్భంలో ఓ బాలికను స్టేజీ పైనకు పిలిచారు. పెద్దయ్యాక ఏమవుతావని అడగ్గా, ఐపీఎస్ అవుతానని ఆమె సమాధానమిచ్చారు. వెంటనే ఆమె తల్లిదండ్రులను సూచిస్తూ ఆమెకు తొందరగానే పెళ్లి చేయవద్దని,  బాగా చదివించాలని సూచించారు. 

గొల్లకురుమలు గొర్లకాపరులుగానే మిగిలిపోవద్దని, వ్యాపారులు, రాజకీయ నాయకులుగా ఎదగాలని అన్నారు. గొల్లకురుమలను ఎస్సీలలో కలపాలని చాలా మంది కోరుతున్నారని చెప్పారు. అందుకోసం తాను ప్రయత్నిస్తారని తెలిపారు. కొమురవెల్లి మల్లన్న దేవాలయాన్ని యాదాద్రి ఆలయం తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. ఉన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటిని గొల్లకురుమలకు అందించాలన్నారు. హక్కుల కోసం పోరాడి అందరూ బాగుపడాలని, ఈ సన్మానం గొల్లకురుమలకు కాదని, రాజ్యాంగానికి చేసిన సన్మానమేనని అన్నారు.

click me!