చారికి కేసీఆర్ భరోసా: కేబినెట్‌లో అవకాశం..?

By sivanagaprasad KodatiFirst Published Dec 13, 2018, 11:45 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో ఫలితాల్లో టీఆర్ఎస్ గాలి బాగా వీచినా.. కొన్ని చోట్ల మాత్రం గులాబీ జెండా ఎగురలేదు. సీనియర్ నేత, స్పీకర్ మధుసూదనాచారి భూపాల్‌‌పల్లిలో ఓడిపోవడం టీఆర్ఎస్ శ్రేణులకు షాకిచ్చింది. 

తెలంగాణ ఎన్నికల్లో ఫలితాల్లో టీఆర్ఎస్ గాలి బాగా వీచినా.. కొన్ని చోట్ల మాత్రం గులాబీ జెండా ఎగురలేదు. సీనియర్ నేత, స్పీకర్ మధుసూదనాచారి భూపాల్‌‌పల్లిలో ఓడిపోవడం టీఆర్ఎస్ శ్రేణులకు షాకిచ్చింది.

అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ పార్టీ స్థాపనలో కీలకంగా వ్యవహారించి, అనేక సందర్భాల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన మధుసూదనాచారిని ఆదుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీనిలో భాగంగానే ఆయనను కేబినెట్‌లోకి తీసుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.

మధుసూదనాచారి గెలిస్తే తన తరువాత తనంతటి పదవిని ఇస్తానని కేసీఆర్ అనేక వేదికలపై ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి పదవి లేదా హోంమంత్రి లేదా రెవెన్యూ లాంటి కీలకమైన శాఖలు లభించవచ్చని చర్చ సాగింది. అయితే అనూహ్యంగా స్పీకర్ ఓడిపోవడంతో ఆయన డీలా పడ్డారు.

ఈ క్రమంలో కేసీఆర్ స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఓదార్చారు. ‘‘ఓడిపోయానని చింతించకండి నేనున్నానంటూ ’’భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మధుసూదనాచారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి కేబినెట్‌లోకి తీసుకుంటారని గులాబీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.

అయితే ఎన్నికల్లో ఓడిపోయినవారు ఎంతటి సన్నిహితులైనా కేబినెట్‌లోకి తీసుకునేది లేదని కేసీఆర్ అల్రెడి ప్రకటించారు. కానీ గతంలో తనకు అత్యంత సన్నిహితులైన నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులను ఎమ్మెల్సీగా చేసి కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయినవారి నుంచి అసమ్మతి ఎదురైన పక్షంలో ఎమ్మెల్సీగా తీసుకుని శాసనమండలి ఛైర్మన్‌గా మధుసూదనాచారికి అవకాశం ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్‌కు ఎదురు తిరిగే వారు టీఆర్ఎస్‌లోనే కాదు..ప్రత్యర్థి పార్టీల్లోనూ లేరు. 
 

click me!