
ఒక వ్యక్తి వారం రోజుల క్రితం మృతి చెందాడు. అయితే ఆయన తప్పతాగి మరణించినట్లు తన భార్య ప్రచారం చేసింది. అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసు విచారణలో అసలు గుట్టు రట్టయింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఆ వివరాలివి.
తన భర్త తప్పతాగి మృతి చెందాడని ఓ మహిళ అందరినీ నమ్మించింది. కానీ పలు అనుమానాలు రేకెత్తడంతో అంత్యక్రియలు చేస్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. విచారించారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడితో కలిసి భార్యే అతడిని హత్య చేసినట్లు తేలింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ లో జరిగింది.
ఈనెల 16న పహాడీషరీఫ్‌లో ఉండే మొహ్మద్ సలీం(35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్రంగా తాగడం వల్లే చనిపోయాడని అతని బార్య షాహిన్‌బేగం అందరినీ నమ్మించింది. చాంద్రాయణగుట్టలోని శ్మశానవాటికలో అంతక్రియలు జరిపేందుకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. విషయం తెలియడంతో పహాడీషరీఫ్ పోలీసులు అంతక్రియలను అడ్డుకున్నారు. మృతదేహాన్ని పీఎమ్‌వీకి తరలించి మృతుని భార్య షాహిన్‌ను విచారించారు.
తాడ్‌బన్ ప్రాంతానికి చెందిన సలీం.. రెండేళ్లక్రితం పహాడీషరీఫ్ వచ్చి ఉంటున్నాడు. కాగా షాహిన్‌కు యూసుఫ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. తమకు సలీం అడ్డువస్తున్నాడని, అతన్ని అంతం చేయాలని షాహిన్ పథకం వేసింది. వృత్తిరిత్యా లారీడ్రైవరైన సలీం ఈనెల16న రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లో షాహిన్‌తో యూసుఫ్ ఉండడంతో భార్యను నిలదీశాడు. యూసుఫ్‌తో గొడవపడ్డాడు.
ఇదే అదనుగా భావించిన షాహిన్ ప్రియుడు యూసుఫ్‌తో కలిసి సలీంపై దాడి చేసి గొంతు నులిమి చంపేశారు. తీవ్రంగా తాగడం వల్లే తన భర్త చనిపోయాడని షాహిన్ అందరినీ నమ్మించింది. ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగడంతో గుట్టురట్టయ్యింది. నిందితులు షాహిన్, యూసుఫ్‌లను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు.