ప్రేమించి పెళ్లాడి తల్లినిచేసాక వదిలేసాడు... భర్త ఇంటిఎదుట భార్య ఆందోళన

Arun Kumar P   | Asianet News
Published : Feb 08, 2022, 02:29 PM ISTUpdated : Feb 08, 2022, 02:40 PM IST
ప్రేమించి పెళ్లాడి తల్లినిచేసాక వదిలేసాడు... భర్త ఇంటిఎదుట భార్య ఆందోళన

సారాంశం

'ఏళ్లపాటు ప్రేమించాడు... ప్రేమ వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లినిచేసాడు.. ఇప్పుడేమో నువ్వు నా భార్యకు కాదంటూ వదిలించుకోవాలని చూస్తున్నాడు...' ఇలా భర్త చేతిలో మోసపోయిన ఓ వివాహిత అత్తవారింటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జగిత్యాల: ప్రేమించి పెళ్లాడిన వాడే ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఓ వివాహిత ఆందోళనకు దిగింది. ఇలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడే దూరం పెడుతుండటంతో తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ అత్తవారింటి ఎదుట ఆందోళన దిగింది. ఈ  ఘటన జగిత్యాల జిల్లా (jagitial district)లో చోటుచేసుకుంది. 

జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన వెంకటేష్, స్వప్న ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. ఇలా ఏళ్ళపాటు ప్రేమించుకున్న వీరిద్దరు పెళ్లి బంధంతో (Love marriage) ఒక్కటయ్యారు. కొంతకాలం వీరి సంసారం సాఫీగడంతో ఓ కుమారుడు పుట్టాడు. 

అయితే ఇటీవల ప్రేమించి పెళ్లాడిన భార్యను వదిలించుకోవాలని వెంకటేష్ చూస్తున్నాడట. తనను దూరం పెడుతూ తప్పించుకుని తిరుగుతుండటంతో  స్వప్న తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ఎంత ప్రయత్నించినా కనీసం మాట్లాడే అవకాశం కూడా భర్త ఇవ్వకపోవడంతో విసిగిపోయిన స్వప్న ఆందోళనకు దిగింది. 

తన బిడ్డను తీసుకుని అత్తవారింటికి వెళ్లిన స్వప్న బయట కూర్చుని ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఈ ఆందోళనను విరమించేది లేదని స్వప్న తెలిపింది. భర్త తనను వదిలించుకోవాలన్న ఆలోచనను వీడాలని... బిడ్డ తల్లినైన తనతో కాపురం చేయాలని స్వప్న డిమాండ్ చేస్తోంది.

 ఇదిలావుంటే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తి ముగ్గురి మృతికి కారణమయ్యాయి. వనపర్తి జిల్లాలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో సహా జూరాల కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. కాలువలో దూకుతుండగా గమనించిన ఓ యువకుడు వీరిని కాపాడే ప్రయత్నం చేసాడు. అయితే కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో కేవలం ఓ బాలుడిని మాత్రమే కాపాడగలిగాడు. మిగతా ముగ్గురు మాత్రం నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. 

పెబ్బేరు పట్టణానికి చెందిన డిసిఎం డ్రైవర్ తెలుగు స్వామి, భవ్యలు పదేళ్ల కిందట ప్రేమించుకుని, కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి అయిదేళ్ల జ్ఞానేశ్వరి, మూడేళ్ల వరుణ్, ఏడాది వయసున్న నిహారిక సంతానం. కొన్ని రోజులుగా కుటుంబ సమస్యల కారణంగా భార్యభర్తలు గొడవ పడుతున్నారు. ఆదివారం కూడా ఇలాగే గొడవ జరిగింది. 

అయితే ఈసారి తీవ్ర మనస్తాపానికి గురైన భవ్య ముగ్గురు పిల్లలను తీసుకుని రాత్రి ఏడున్నర గంటల సమయంలో పట్టణ సమీపంలో ఉన్న జూరాల ఎడమ ప్రధాన కాలువ వద్దకు వెళ్లింది. మొదట పిల్లలను కాలువలో తోసేసి ఆ తర్వాత ఆమె కూడా దూకింది. ఇదంతా కొందరు స్థానికులు గమనించి కేకలు వేయడంతో అటువైపు వెళుతున్న కుమార్ అనే యువకుడు నీటిలోకి దూకి కొట్టుకుపోతున్న మూడేళ్ల వరుణ్ ని కాపాడగలిగాడు. తల్లి, ఇద్దరు కుమార్తెలు మాత్రం గల్లంతయ్యారు. 

విషయం తెలిసిన స్థానిక ఎస్ఐ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే రామన్ పాడు జలాశయం అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపి వేయించి గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభించాయి.  వీటిని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే