తెలంగాణ రాజకీయాల్లో ఎవరు బాహుబలి... ఎవరు కట్టప్ప?

First Published Mar 19, 2017, 10:53 AM IST
Highlights

అసెంబ్లీ లాబీలో, గాంధీ భవన్ లో ఇప్పుడు ప్రజాసమస్యల కంటే కాంగ్రెస్ లో బాహుబలి ఎవరనే చర్చే ఎక్కువగా సాగుతోంది.

రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సినిమా బాహుబలి  ఫీవర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బాగా పట్టుకున్నట్లుంది. రాష్ట్రంలో తామే బాహుబలులమని చెప్పుకుంటున్నారు. పనిలో పనిగా సీఎం కేసీఆర్ ను కట్టప్పతోనూ, బల్లాలదేవుడుతోనూ పోల్చుతున్నారు.

 

మొన్న అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ సీఎల్పీ నేత జానా రెడ్డి బాహుబలి ప్రస్తావన తీసుకొచ్చారు. కేసీఆర్ సర్కారును కూల్చడానికి కాంగ్రెస్ నుంచి ఓ బాహుమలి వస్తాడని అన్నారు. దీంతో ఈ జబ్బు కాంగ్రెస్ లోని ఇతర నేతలకు కూడా బాగా అంటుకుంది.

 

అసెంబ్లీ లాబీలో, గాంధీ భవన్ లో ఇప్పుడు ప్రజాసమస్యల కంటే కాంగ్రెస్ లో బాహుబలి ఎవరనే చర్చే ఎక్కువగా సాగుతోంది.

 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దని గట్టి పట్టుదలగా ఉన్నట్లున్నారు. కాంగ్రెస్ లో జానా రెడ్డి మాత్రమే కాదు చాలా మంది బాహుబలులు ఉన్నారని తన గురించి చూచాయిగా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఆ బాహుబలి ఎవరో చూస్తారని పేర్కొన్నారు.

 

ఇక జీవన్ రెడ్డి గాంధీ భవన్ లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో బాహుబలులు చాలా మంది ఉన్నారని తెలిపారు.

 

కాంగ్రెస్ యువ నేత సంపత్ అయితే తానే తెలంగాణ బాహుబలినని ఈ విషయాన్నే జానా రెడ్డి ఒకసారి చెప్పారని గుర్తు చేశారు. ఢిల్లీలో అయితే తమ అధినేత రాహుల్‌ గాంధీ బాహుబలి అని పేర్కొన్నారు.

 

ఇక డీకే అరుణ అయితే బాహుబలి ఎవరనేది చెప్పలేదు కానీ కట్టప్ప మాత్రం సీఎం కేసీఆర్ అని స్పష్టం చేసింది. కట్టప్పలాంటి కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌లోనే ఒకరు బాహుబలిగా అవతారమెత్తుతారని చెప్పింది.

బాహుబలి మొదటి భాగంలో కట్టప్ప వెన్నుపోటు పొడిచాడని, ఇప్పటిదాకా కేసీఆర్‌ చేసింది కూడా అదేనని విమర్శించారు.

click me!