KA Paul: పార్టీ గుర్తు ఇంకెప్పుడు కేటాయిస్తారు?: ఈసీపై కేఏ పాల్ ఆగ్రహం

ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఎన్నికల సంఘంపై సీరియస్ అయ్యారు. నామినేషన్ల గడువు ముగుస్తున్నదని, అయినా తమ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించడం లేదని అన్నారు. నామినేషన్లకు గడువు ముగుస్తున్నా ఇంకా కేటాయించకపోవడంపై ఆగ్రహించారు.
 


హైదరాబాద్: ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఈ రోజు ఎన్నికల సంఘం అధికారులపై సీరియస్ అయ్యారు. నామినేషన్ల గడువు ముగుస్తున్నదని, తమకు ఇంకెప్పుడు పార్టీ సింబల్ కేటాయిస్తారని ప్రశ్నించారు. సెప్టెంబర్‌లోనే అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చారని, అయినా ఇంకా పార్టీ గుర్తు కేటాయించలేదని ఫైర్ అయ్యారు. పార్టీ యాక్టివ్‌గా లేదని వారు చెబుతున్నారని ఆగ్రహించారు. అసలు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కమిషనర్ నడుపుతున్నారో? కేసీఆర్ నడుపుతున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. 

అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న వైఎస్సార్టీపికి కూడా ఎన్నికల గుర్తు కేటాయించారని, ప్రజా శాంతి పార్టీకి సింబల్ ప్రకటించకపోవడంపై ఆగ్రహించారు. నామినేషన్లకు రేపు చివరి తేదీ అని, అయినా.. ఇంకా తమకు సింబల్ ఇవ్వకపోవడం దారణం అని చెప్పారు. అసలు తనను ఎందుకు ఇంతలా వేధిస్తున్నారో అర్థం కావట్లేదని వాపోయారు. అన్ని పత్రాలు సమర్పించినా సింబల్ ఎందుకు కేటాయించడం లేదని అడిగారు. సింబల్ కోసం నిరాహార దీక్ష చేయాలా? అని ప్రశ్నించారు.

Latest Videos

తమకు హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయిస్తారో స్పష్టత ఇవ్వడం లేదని కేఏ పాల్ తెలిపారు. ఆరు నెలలుగా ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు గానీ, సింబల్ కేటాయించడం లేదని ఆరోపించారు. తన పోరాటంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని పాల్ అన్నారు. 

ప్రజా శాంతి పార్టీకి వెంటనే ఎన్నికల గుర్తు కేటాయించాలని కేఏ పాల్ తెలిపారు. నామినేషన్లకు మరో రెండు రోజుల గడువు పెంచాలనీ డిమాండ్ చేశారు. అసలు తమ పార్టీకి ఎన్నికల గుర్తు ఎందుకు ఇవ్వడం లేదో ఈసీ వివరణ ఇవ్వాలని అన్నారు. 

Also Read: ప్రధాని మోడీ, రాహుల్ గాంధీపై కామారెడ్డిలో సీఎం కేసీఆర్ విసుర్లు

తెలంగాణ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తున్నదని, అభ్యర్థులు నామినేషన్లు వేస్తే ఎన్నికల గుర్తు ఏంటని అడుగుతున్నారని కేఏ పాల్ తెలిపారు. అయితే... ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వివరించారు. అభ్యర్థులకు ప్రచారం కోసం సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారని, అందుకే పోటీ చేయడం లేదని చెప్పారు.

click me!