బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

By narsimha lodeFirst Published Sep 13, 2018, 12:25 PM IST
Highlights

 గోదావరిపై బాబ్లీ సహా అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ 2010లో  అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్షనేత చంద్రబాబునాయుడు తమ పార్టీకి చెందిన  ప్రజా ప్రతినిధులతో కలిసి బాబ్లీని సందర్శించిన సమయంలో  అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

హైదరాబాద్: గోదావరిపై బాబ్లీ సహా అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ 2010లో  అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్షనేత చంద్రబాబునాయుడు తమ పార్టీకి చెందిన  ప్రజా ప్రతినిధులతో కలిసి బాబ్లీని సందర్శించిన సమయంలో  అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

2010 జూలై మాసంలో తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు షెడ్యూల్ విడుదలైంది.శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌ను చూపేందుకుగాను  ఉప ఎన్నికలకు  టీఆర్ఎస్  ఆనాడు కారణమైంది.

అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూడ తెలంగాణలో  తన అభ్యర్థులను  బరిలోకి దింపింది. గోదావరిపై బాబ్లీతో సహా సుమారు 10కి పైగా ప్రాజెక్టులను  మహరాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని ఆనాడు టీడీపీ ఆరోపించింది.ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలనకు  చంద్రబాబునాయుడు సహా టీడీపీ ప్రజా ప్రతినిధులు బాబ్లీ వద్దకు వెళ్లారు.

2010 జూలై 16వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన చంద్రబాబునాయుడు సహా ఎర్రబల్లి దయాకర్ రావు ఇతర టీడీపీ ప్రజాప్రతినిదులను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నిషేధం ఉన్నప్పటికీ కూడ  బాబు సహా టీడీపీ ప్రజా ప్రతినిధులు బాబ్లీని సందర్శించారని ఆరోపిస్తూ ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

అయితే బాబు సహా టీడీపీ ప్రజా ప్రతినిధులను నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ ఐటీఐ కాలేజీల్లో నిర్భంధించారు.  సుమారు నాలుగు రోజుల పాటు బాబు సహా టీడీపీ ప్రజా ప్రతినిధులంతా అదే ఐటీఐ కాలేజీలోనే ఉన్నారు.

అయితే టీడీపీ ప్రజా ప్రతినిధులపై ఆనాడు మహారాష్ట్ర పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేశారనే ఆరోపణలు కూడ లేకపోలేదు. ఈ ఘటన ఆనాడు సంచలనం సృష్టించింది.

నాందేడ్ జిల్లాలోని సుమారు 8వేల హెక్టార్లకు సాగు నీటిని అందించేందుకుగాను  2.74 టీఎంసీల నీటిని ఉపయోగించుకొనే ఉద్దేశ్యంతో  బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర సర్కార్ చేపట్టింది. అయితే  ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం  2006లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2007లో రెండు హియరింగ్స్ తర్వాత  బ్యారేజీని నిర్మించుకోవచ్చని సుప్రీం తమకు అనుమతిచ్చిందని ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో బాబ్లీ ప్రాజెక్టుతో పాటు మరో 14 ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆనాడు టీడీపీ ఆరోపించింది.

అయితే ఆనాటి ఏపీ ప్రభుత్వంతో పాటు టీడీపీ వాదనలను  మహారాష్ట్ర తోసిపుచ్చింది. టీడీపీ నేతలు బాబ్లీ ప్రాజెక్టును సందర్శిస్తే అరెస్ట్ చేస్తామని ప్రకటించి మరీ ఆ రాష్ట్రం బాబును అరెస్ట్ చేసింది.

సుమారు నాలుగు రోజులకుపైగా బాబు సహా ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులంతా  ధర్మాబాద్ లోనే ఉన్నారు. అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ  పెద్ద ఎత్తున  ఏపీలో నిరసనలను చేపట్టారు టీడీపీ కార్యకర్తలు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు జరిపాయి. చంద్రబాబునాయుడుతో సహా టీడీపీ ప్రజాప్రతినిధులను విడుదల చేశాయి.  అప్పటి ఏపీ సీఎం రోశయ్య మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. 

అయితే ఆనాడు తెలంగాణలో ఉప ఎన్నికల్లో  టీడీపీ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొనకుండానే దూరంగా ఉండాల్సి వచ్చింది. మహరాష్ట్రలోనే అరెస్టై ఉండడంతో  టీడీపీ అభ్యర్థుల ప్రచారానికి  ముఖ్య నేతలు దూరం కావాల్సి వచ్చింది.

అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో  ఏం చెప్పాలో తెలియకనే బాబ్లీ పోరాటాన్ని టీడీపీ ఎంచుకొందని ఆనాడు టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. అయితే ఈ కేసు విషయమై త్వరలోనే బాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని మహారాష్ట్ర మీడియాలో వార్తలు రావడంతో ప్రస్తుతం ఈ ఆందోళన తాజాగా వార్తల్లోకి వచ్చింది.

మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన నేపథ్యంలో కోర్టు నోటీసులు రావడం కూడ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ వార్త చదవండి

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

 

 

click me!