మందగించిన రుతుపవనాలు... తెలుగురాష్ట్రాల్లో వర్షపాతం ఎలా వుండనుందంటే...

By Arun Kumar PFirst Published Jun 16, 2021, 9:56 AM IST
Highlights

ఈ వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశామని... కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక అది ఏర్పడే అవకాశాలు కనిపించటం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 

హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్, బీహార్ ల మీదుగా పశ్చిమ గాలులు వీస్తున్నందున రుతు పవనాలు ముందుకు కదలటం మందగించిందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఈ వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశామని... కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక అది ఏర్పడే అవకాశాలు కనిపించటం లేదని పేర్కొన్నారు. 

తాజా వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో కేవలం తూర్పుతీర ప్రాంతంలో రానున్న అయిదు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే ఇవాళ(మంగళవారం)తెలంగాణలో చెదురుమదురుగా, కొన్ని చోట్ల భారీ వర్షాలు,  మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ ప్రకటించింది. 

ఇదిలావుంటే నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే తెలంగాణకు చేరాయి. అందువల్లే పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. గత మూడేళ్లలో తొలిసారిగా తెలంగాణ‌లోకి  నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే వచ్చాయని తెలిపారు.

రుతుపవనాల ప్రవేశంతో రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాలయిన మేడ్చల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసాయి. సిద్దిపేట, సిరిసిల్ల కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, నిజామాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోనూ చాలా ప్రాంతాలకు నైరుతి రుతుప‌వ‌నాలు ప్రవేశించినట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 

click me!