త్వరలోనే తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాతో పాటు మేనిఫెస్టోను విడుదల చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్: మూడో లిస్ట్ తో పాటు మేనిఫెస్టో ను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.సోమవారంనాడు హైద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.నవంబర్ 1వ తేదీన తమ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉందన్నారు.ఈ సమావేశంలో మూడో లిస్ట్ పై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. మరో వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై కూడ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇవ్వనుందన్నారు.
టీఎస్‌పీఎస్‌సీ స్కాంపై కేటీఆర్ వ్యాఖ్యలు దొంగలు పడ్డ ఆరు నెలలకు FIR వేసిన చందంగా ఉందని చెప్పారు. డిసెంబర్ 3 తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటూ యువతను, నిరుద్యోగులను మళ్లీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఫామ్ హౌస్ కు పరిమితం చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు.
undefined
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి కేంద్ర ప్రభుత్వం ఎలా ఉద్యోగాల భర్తీ చేస్తుందో రాష్ట్రంలో కూడ అలానే చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.ఉద్యోగ నియామకాలు చేయని కారణంగా 30 లక్షల మంది యువత కుటుంబాలు నిరాశలో కూరుకుపోయాయని కిషన్ రెడ్డి చెప్పారు.
గ్రూప్ అభ్యర్థుల ఆత్మహత్యలకు కారణం ముమ్మాటికి కేసీఆర్ సర్కార్ పాపమేనని ఆయన ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం మీ పాపం కాదా...? అని ఆయన ప్రశ్నించారు. మెట్ పల్లికి చెందిన యువకుడు రెహమత్ కూడా గ్రూప్ 1, 2 పరీక్షలు వాయిదా పడ్డాయని ఆత్మహత్య చేసుకుంటే.... మీ అధికారాన్ని ఉపయోగించి దానిని తొక్కిపెట్టడం వాస్తవం కాదా...? అని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీకేజీ కారణంగా 17 సార్లు పరీక్షల్ని వాయిదా వేసిన రికార్డ్ పాలనా మీదని బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు.
బిశ్వాస్ కమిటీ 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనీ రిపోర్ట్ ఇస్తే కేసీఆర్ సర్కార్ 80వేల ఉద్యోగాలే అని మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో 25వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలుంటే 13,600 టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ 5089 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 6800 గవర్నమెంటు స్కూళ్లు ఒకే ఒక్క టీచర్ తో నడుస్తున్నాయని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న 442 ప్రభుత్వ జానియర్ కాలేజీలు, 140 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 4200 ఖాళీలు వెక్కిరిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అని హామీ ఇచ్చిన కేసీఆర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించాడన్నారు.
ఇక 2018 ఎన్నికల్లో నిరుద్యోగులకు నెలకు రూ.3016 భృతి ఇస్తా అన్న హామీకి ఇంతవరకు అతీగతీ లేదని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపిస్తారని కిషన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.