
హైదరాబాద్ లోని సరూర్‌నగర్‌లో కలకలం సృష్టించిన పరువు హత్య ఘటనను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. రాజ్యాంగం, ఇస్లాం ప్రకారం ఇది నేరపూరిత చర్య అని ఆయన అభివర్ణించారు.శుక్రవారం ఆయన హైదరాబాద్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆ మహిళ ఇష్టంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని తెలిపారు. భర్తను చంపే హక్కు ఆమె సోదరుడికి లేదని అన్నారు. ఇది నేరపూరిత చర్య అని తెలిపారు. రాజ్యాంగం, ఇస్లాం మతం ప్రకారం ఇది ఒక చెత్త నేరం అని తెలిపారు. ‘‘ నిన్నటి నుంచి ఈ ఘటనకు మరో రంగు పులముతోంది. నిందితుడిని ఇక్కడి పోలీసులు వెంటనే అరెస్ట్ చేయలేదా?. అరెస్ట్ చేశారు.. హంతకులకు మేం అండగా నిలవడం లేదు.’’ అని ఒవైసీ కామెంట్స్ చేశారు.
జహంగీర్‌పురి, ఖర్గోన్‌లలో జరిగిన మతపరమైన హింసాత్మక ఘటనలపై కూడా ఒవైసీ మాట్లాడారు. “ ఏ మతపరమైన ఊరేగింపును బయటకు తీసినా, మసీదుపై హై రిజల్యూషన్ సీసీటీవీని ఉంచాలి. ఊరేగింపు జరిగినప్పుడల్లా అది జరగాలని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరు రాళ్లు విసురుతున్నారో ప్రపంచానికి తెలియాలంటే ఫేస్‌బుక్‌లో లైవ్ టెలికాస్ట్ చేయాలి.’’ అన్నారు.
బిల్లిపురం నాగరాజు హత్యకేసులో ప్రమేయం ఉన్న అష్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి బంధువుల ఇద్దరిని గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సయ్యద్ మోబిన్ అహ్మద్, అష్రిన్ సుల్తానా, మహ్మద్ మసూద్ అహ్మద్ సోదరులుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
‘‘ IPC సెక్షన్ 302, SC/ST చట్టం కింద కేసు నమోదైంది. విచారణ త్వరలో ముగియనుంది. మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దరఖాస్తు చేస్తాము. దీని వల్ల కేసు విచారణ త్వరగా ముగుస్తుంది. నిందితులకు శిక్ష పడుతుంది. మరణించిన వారి కుటుంబానికి నష్టపరిహారం, ఉద్యోగం కల్పిస్తాం ’’ అని LB నగర్ DCP పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన పంజాల అనిల్‌కుమార్ కాలనీలో బుధవారం బైక్‌పై వెళుతున్న నవ దంపతులపై రాత్రి 9 గంటలకు ఇనుప రాడ్‌తో దాడి చేసి, కత్తితో దాడి చేయడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్యలో ప్రమేయం ఉందని భావిస్తున్న నిందితుడు సయ్యద్ మోబిన్ అహ్మద్ సోదరిని నాగరాజు వివాహం చేసుకున్నందుకు అతడిపై పగ పెంచుకున్నారు.
మృతుడు బిల్లిపురం నాగరాజు ఎస్సీ-మాల సామాజికవర్గానికి చెందినవాడు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఆష్రిన్ సుల్తానా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ క్లాస్ మేట్స్. ఒకే స్కూల్ లో, ఒకే కాలేజీలో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. సుల్తానా నాగరాజుతో ప్రేమలో ఉందని ఆమె సోదరుడు సయ్యద్ మొబిన్ అహ్మద్ గుర్తించాడు. సోదరిని హెచ్చరించాడు. అయితే ఈ ఏడాది జనవరి 30వ తేదీన బాలానగర్ లోని ఐడీపీఎల్ కాలనీలో ఉన్న తన ఇంటి నుంచి ఆమె తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోనే వదిలేసి బయటకు వచ్చింది. మరుసటి రోజు నాగరాజు, అష్రిన్ సుల్తానా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచే పగ పెంచుకున్న నిందితుడు నాగరాజును హత్య చేశారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.