తెలంగాణలో అధికారంలోకి రాగానే మత పరమైన రిజర్వేషన్లు రద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Aug 30, 2022, 3:16 PM IST
Highlights

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే మత రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మత పరంగా రిజర్వేషన్లను ఆయన తప్పుబట్టారు. అయితే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే  మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తేల్చి చెప్పారు. మంగళవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగారెడ్డిజిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం ఇచ్చిన  లక్ష కోట్లను  రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై కేంద్రీకరించింది. అమిత్ షా కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సునీల్ బన్సాల్ ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా ఆ పార్టీ నియమించింది.  తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సునీల్ బన్సల్ కేంద్రీకరించనున్నారు.  గతంలో రాష్ట్రంలో పర్యటించిన బీఎల్ సంతోష్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాన్ని గుర్తించారు. తెలంగాణకు పార్టీ ఇంచార్జీగా సునీల్ బన్సల్ ను పంపారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు బన్సల్ ఇంచార్జీగా ఉన్నారు. 2014లో యూపీలో బీజేపీ అధికంగా ఎంపీ  స్థానాలు కైవసం చేసుకోవడంలో అమిత్ షా తో కలిసి సునీల్ బన్సల్ వ్యూహాలను అమలు చేశారు. ఈ కారణంగానే యూపీ నుండి బీజేపీ ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలను గెలుచుకుంది.

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై ఆ పార్టీ ఫోకస్ ను మరింత పెంచింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.  ఈ రెండు స్థానాలు టీఆర్ఎస్ స్థానాలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గణనీయమైన సీట్లను పొందింది. 4 కార్పోరేటర్ల నుండి 40కి పైగా కార్పోరేట్ స్థానాలను దక్కించుకుంది. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్ పెట్టింది. 

click me!