రానున్న రోజుల్లో పెన్షన్లను పెంచుతాం: మెదక్ పర్యటనలో కేసీఆర్

By narsimha lode  |  First Published Aug 23, 2023, 4:42 PM IST

మెదక్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత  అధికారులతో  సీఎం కేసీఆర్ మాట్లాడారు.  రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతున్న అధికారులను ఆయన అభినందించారు.
 


హైదరాబాద్:రానున్న రోజుల్లో పెన్షన్లను  పెంచేందుకు  కృషి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.


మెదక్  నూతన కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ బుధవారంనాడు ప్రారంభించారు.  అనంతరం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన  సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

Latest Videos

మీకు పరిపాలన చేతకాదని గతంలో తెలంగాణ వారిని ఉద్దేశించి  ఉమ్మడి ఆంధ్రపాలకులు చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ బిడ్డలకు ఏ పాటి  పాలన  సాధ్యమౌతుందో  మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను చూస్తేనే అర్ధమౌతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో  సచివాలయాలు కూడ బాగా లేవన్నారు. కానీ, మన రాష్ట్రంలో  కొత్త కలెక్టరేట్లు అద్భుతంగా నిర్మించుకున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు  చేశారు.

గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలను కూడ అధిగమించి తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ వినియోగంలో కూడ  మన రాష్ట్రం అగ్ర స్థానంలో నిలిచిందన్నారు.  రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే  అద్భుత ప్రగతిని సాధించినట్టుగా  కేసీఆర్ చెప్పారు.

also read:మెదక్‌లో సీఎం టూర్: నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించిన కేసీఆర్

రాష్ట్రంలో  50 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు 24 లక్షల పెన్షన్లు మాత్రమే ఉండేవన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన పెన్షన్ల కంటే రెట్టింపు పెన్షన్లను ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రానున్నరోజుల్లో పెన్షన్లను మరింత పెంచుతామని సీఎం కేసీఆర్  ప్రకటించారు.నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన గుర్తు చేశారు.  ఇదంతా అధికారుల కృషి వల్లే సాధ్యమైందన్నారు.
ఒకప్పుడు కాలువలు ఎలా ఉండేవి,ఇప్పుడు ఎలా ఉన్నాయని ఆయన  ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు విజయవంతంగా  పూర్తయ్యేలా చేసిన అధికారులను సీఎం అభినందించారు. మెదక్ జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని సీఎం హామీ ఇచ్చారు.


 

tags
click me!