
గద్వాల్ : గద్వాల్ లో విషాదం చోటు చేసుకుంది. మంచినీరు కలుషితం కావడం వల్ల నలుగురు మృతి చెందగా, 56మంది అస్వస్థతపాలయ్యారు. అయితే, దీనిమీద ఇంకా స్పష్టత లేదు. మరణించిన నలుగురు వ్యక్తులు మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారు. వారి వయస్సు 40 మరియు 60 మధ్య ఉంటుంది. వారి ప్రస్తుత పరిస్థితులు గ్యాస్ట్రోఎంటెరిటిస్‌ను తీవ్రతరం చేసి వారి మరణాలకు కారణమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇక కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై గద్వాల్ జిల్లా ఆసుపత్రిలో చేరిన 56 మందిలో ముగ్గురు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, మిగిలిన 53 మంది నిలకడగా ఉన్నారని గద్వాల్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ చందు నాయక్ తెలిపారు. వీరందరికీ ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించడంతో నీరు కలుషితం అయ్యిందని అనుమానిస్తున్నారు.
ఈ 56 మందిలో గద్వాల్‌లోని వేదానగర్, గండవీధి, బుద్ధపేటతో పాటు కొన్ని ప్రాంతాలకు చెందిన రోగులు ఉన్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. "ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు. చుట్టు పక్కలున్న పరిసరాల నుండి మురుగు నీరు ఈ ప్రాంతాలకు వచ్చే మంచినీటిలోకి చేరి ఉండవచ్చు" అని అభిప్రాయపడ్డారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీటిని అధికారులు పరీక్షించగా అందులో ఎలాంటి కలుషితాలు లేవన్నారు.
హైద్రాబాద్ మాదాపూర్‌లో కలుషిత నీరు: ఒకరి మృతి, 27 మందికి అస్వస్థత
అయితే, గద్వాల కమిషనర్ ఎస్.వి. జానకి రామ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని చాలా ఇళ్లలో మామూలుగా మంచినీళ్లకోసం ఇంటిముందు గుంత కట్టిస్తారని.. ఆ గుంతల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడానికి వాడతారని తెలిపారు. అలా నీరు కలుషితం అయి ఉండొచ్చని మున్సిపల్ వాటర్ సమస్య కాదని అన్నారు. దీనికోసం గురువారం నాడు గుంతల్లోని నీటి నమూనాలను పరీక్షలకు పంపారు.
ఇక, జోగులాంబ గద్వాల్ పోలీసు సూపరింటెండెంట్ రంజన్ రతన్ కుమార్ నీరు కలుషితం కాలేదని ఖండించారు. జిల్లాలో వాతావరణంలో మార్పులే ఈ సామూహిక అనారోగ్యాలకు కారణమని వైద్యులు తెలిపారన్నారు. భారీ వర్షాల కారణంగా గద్వాలలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
ప్రస్తుతం జిల్లా ఆస్పత్రికి చెందిన దాదాపు 95 మంది వైద్య సిబ్బంది, 10 మంది వైద్యులు ఇంటింటికీ వెళ్లి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మాత్రలు పంపిణీ చేస్తున్నారు. నీటి గుంతలను మూసివేశామని, నీరు కలుషితం కాకుండా నళ్లాల ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని జానకిరామ్ తెలిపారు.