ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి కలకలం: చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకొన్నారు

By narsimha lodeFirst Published Nov 18, 2020, 6:22 PM IST
Highlights

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి కలకలం సృష్టించింది. స్థానికులపై పులి దాడి చేయబోయింది. అయితే పులి బారి నుండి స్థానికులు చాకచక్యంగా తప్పించుకొన్నారు.


ఆసిఫాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి కలకలం సృష్టించింది. స్థానికులపై పులి దాడి చేయబోయింది. అయితే పులి బారి నుండి స్థానికులు చాకచక్యంగా తప్పించుకొన్నారు.బెజ్జూరు మండలంలోని ఏటిగూడ వద్ద నడిరోడ్డుపై పులి హల్ చల్ చేసింది. ప్రయాణీకులను, పాదచారులను వెంటాడింది.

పులి వెంటాడంతో పాదచారులు పరుగులు తీశారు. పులిని తప్పించుకొనేందుకు పరుగెత్తుతూ కిందపడిపోయారు. పులి సమీపిస్తోందనే భయంతో లేచి సమీపంలోని చెట్టు ఎక్కారు. దీంతో  ఆ ఇద్దరు కూడ ప్రాణాలతో బయటపడ్డారు.

మరో ఇద్దరు కూడ బైక్ పై పులి బారి నుండి తప్పించుకొన్నారు. ఆరుగురు వ్యక్తులు కమ్మర్గాం గుండెపల్లి గ్రామాల నుండి బెజ్జూరు మండల కేంద్రానికి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

పులి సంచారంతో అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటేనే స్థానికులు గిరిజనులు జంకుతున్నారు.వారం రోజుల క్రితం ఓ యువకుడిపై పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ పై పులి దాడి చేసి చంపింది.

ఇదే మండలంలో ఇవాళే పశువుల మందపై పులి దాడి చేసిందని పశువుల కాపర్లు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అటవీ శాఖాధికారులు  ఈ ప్రాంతానికి చేరుకొని పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఆసిపాబాద్ జిల్లాలోని బెజ్జారుతో పాటు సమీప మండలాల ప్రజలు పులితో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చి పులి దాడి చేస్తోందోననే భయంతో ఉన్నారు.

click me!