
Vikarabad Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి సమీపంలో ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
బస్సు ప్రమాదం జరిగినవెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు... వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను కాపాడారు. దీంతో భారీ ప్రాణాపాయం తప్పింది. ఇక పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు... క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శివారు పటాన్ చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన కొందరు అంత్యక్రియల కోసం వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం చింతకుంటకు బయలుదేరారు. ఇలా శనివారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో దాదాపు 50 మందికి పైగా పయనం అయ్యారు. అయితే అనంతగిరి దగ్గర్లో ఘాట్ రోడ్డు దిగుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. దీంతో అందులోని కొందరు ప్రయాణికులు తీవ్ర గాయాలతో స్పాట్ లోనే మరణించారు... మరికొందరు తీవ్ర గాయాలపాలైనా ప్రాణాలతో బైటపడ్డారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్ లో గాయపడ్డవారు చికిత్స పొందుతున్నారు.