
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల్లో బైక్, కార్ రేసింగ్‌లపై స్పందించారు ఎస్పీ కోటిరెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేసింగ్‌లు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అడవుల్లో రేసింగ్‌ల్లో పాల్గొన్న వారిలో కొందరిని గుర్తించామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు బైక్ రేసింగ్‌లో పాల్గొన్న వారందరిపై చర్చలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు స్వాతంత్య్ర దినోత్సవ బందోబస్తులో వుండగా యువత రేసింగ్‌కు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు ఎస్పీ కోటిరెడ్డి. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
కాగా.. అనంతగిరి హిల్స్‌లో కార్ రేసింగ్‌లతో రెచ్చిపోయారు కొంతమంది యువకులు. భారీగా అనంతగిరి హిల్స్‌కు వెళ్లిన వారు పోలీస్ సైరన్ వేసుకుంటూ కార్లతో స్టంట్లు చేస్తూ సందర్శకులను భయభ్రాంతులకు గురిచేశారు. వీకెండ్‌లలో తరచు ఇక్కడ కార్ రేసింగ్‌లు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. కారు రేసింగ్‌ల కోసం ఎయిర్‌గన్‌లను కూడా వాడుతున్నట్లుగా తెలుస్తోంది. సైట్ సీయింగ్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న వారు కారు రేసింగ్‌లతో భయపడిపోతున్నారు.